IND Vs SL: వరల్డ్ కప్ లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లంకతో భారత్ ఢీ, వాంఖడే స్టేడియంలో ధోనీ సాధించిన ఘనతను రోహిత్ సాధిస్తాడా? ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫాన్స్

ఓటమి లేకుండా విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన టీమిండియా (Team India) అన్నింటిలో విజయం సాధించింది. వరుస విజయాలతో భారత జట్టు దాదాపు సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టడం ఖాయమైంది.

Credit@ BCCI twitter

Mumbai, NOV 02: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో (CWC 23) టీమిండియా హవా కొనసాగుతోంది. ఓటమి లేకుండా విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన టీమిండియా (Team India) అన్నింటిలో విజయం సాధించింది. వరుస విజయాలతో భారత జట్టు దాదాపు సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టడం ఖాయమైంది. అయితే, గురువారం వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2గంటలకు శ్రీలంక జట్టుతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ అధికారికంగా ఖరారైనట్లే. రోహిత్ శర్మ (Rohit sharma) సారథ్యంలోని టీమిండియా ముంబైలో శ్రీలంకతో తలపడనుంది. టీమిండియా విజయం సాధిస్తే సెమీస్ లోకి దూసుకెళ్తుంది. అదేసమయంలో శ్రీలంక జట్టు (Ind Vs Sl) సెమీస్ కు అర్హత కోల్పోతుంది. అధికశాతం క్రికెట్ అభిమానులు 12ఏళ్ల క్రితం ఫలితం పునరావృతం అవుతుందని భావిస్తున్నారు. 2011 ప్రపంచ కప్ లో భాగంగా వాంఖడే స్టేడియంలో శ్రీలంక – భారత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni) సారథ్యంలోని టీమిండియా లంక జట్టును ఓడించి 2011 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచింది. మరోసారి అదేతరహా ఫలితం ఫునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ తరువాత దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో ఏదోఒక మ్యాచ్ లో విజయం సాధించినా సెమీస్ లోకి అడుగు పెడుతుంది.

శ్రీలంక జట్టుతో (Ind Vs Sl) పోల్చితే భారత్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. గడిచిన ఆరు మ్యాచ్ లలో టీమిండియా ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అద్భుత ఆటతీరును కనబరుస్తున్నారు. శ్రీలంక జట్టు సారధి శానకతో పాటు పతిరన, కుమార గాయాలతో మ్యాచ్ కు దూరం కావడం ఆ జట్టును దెబ్బతీసింది. మిగతా ఆటగాళ్లలో నిలకడ కొరవడింది. ఆరంభంలో అదరగొట్టిన కుశాల్ మెండీస్.. శానక స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టాడు. ప్రస్తుతం అతను ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. బౌలింగ్ లో తీక్షణ నిరాశ పరుస్తున్నాడు. టోర్నీలో సత్తా చాటుతున్న పేసర్ మదుశంకతో పాటు ఆలస్యంగా జట్టులోకి వచ్చిన మాథ్యూస్ మీద ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.

 

టీమిండియాలో బ్యాటర్లు, బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణిస్తున్నారు. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ (Shreyas) విషయంలోనే కొంత ఆందోళ వ్యక్తమవుతుంది. అతను వరుస మ్యాచ్ లలో విఫలమవుతున్నాడు. ఈ టోర్నీలో ఆరు మ్యాచ్ లలో శ్రేయస్ ఉన్నాడు.. కేవలం 134 పరుగులే చేశాడు. షార్ట్ బాల్ కు ఔట్ అవుతూ విమర్శల పాలవుతున్నాడు. ఈ మ్యాచ్ అతనికి కీలకం. ఈ మ్యాచ్ లో రాణించకుంటే శ్రేయస్ ను పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రోహిత్, గిల్, కోహ్లీ, రాహుల్, జడేజా వంటి ఆటగాళ్లతో భారత్ కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్ విభాగంలో బూమ్రా, షమీ, సిరాజ్ లు ఆరంభంలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. స్పిన్ విభాగంలో కుల్ దీప్, జడేజా రాణిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే శ్రీలంకపై భారత్ విజయం సాధిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

వాంఖడే స్టేడియంలో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుంది. ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా 399, 382 పరుగులు చేసింది. మొదట ఎవరు బ్యాటింగ్ చేసినా 300 స్కోర్ దాటే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే ప్రస్తుతం జట్టులోని బ్యాటర్ల ఫాం ప్రకారం స్కోర్ 400కు చేరువ అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. బ్యాటింగ్ తో పాటు కాస్త స్పిన్ కుకూడా వాంఖడే పిచ్ సహకరిస్తుంది.