Pak Won On Netherlands: పాక్ టార్గెట్‌ ను చేధించడంలో తడబడ్డ నెదర్లాండ్స్, ఉప్పల్ మ్యాచ్‌లో పాక్ విజయం, 9 ఓవర్లు ఉండగానే ఆల్‌ ఔట్

తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 286 పరుగులకు ఆల్ ఔట్ అయింది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లకే 205 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

Pak Won On Netherlands (PIC@ ICC X)

Hyderabad, OCT 06: ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్-2023 టోర్నీలో (ICC World CUP) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ (PAK Vs Netherlands) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 286 పరుగులకు ఆల్ ఔట్ అయింది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లకే 205 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో నెదర్లాండ్స్ మీద పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఓపెనర్లు ఫఖర్ జమాన్ 12, ఇమాం ఉల్ హక్ 15 పరుగులకు, సారధి బాబర్ ఆజం ఐదు పరుగులకే పెవిలియన్ దారి పట్టినా తర్వాత బ్యాటింగ్‌ కు వచ్చిన మహ్మద్ రిజ్వాన్ 68, షౌద్ షకీల్ 68 పరుగులతో జట్టుకు గట్టి పునాది వేశారు. మహ్మద్ నవాజ్ 39, షాదాబ్ ఖాన్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డే లీడే నాలుగు వికెట్లు, కలిన్ అకర్ మాన్ రెండు వికెట్లు, ఆర్యన్ దట్, లోగాన్ బెర్క్, పాల్ వాన్ మీకెరెన్ చెరో వికెట్ తీశారు.

 

తర్వాత 287 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన నెదర్లాండ్స్ ఓపెనర్లలో విక్రమ్ జిత్ సింగ్ 52, బాస్ డీ లీడే 67, లగాన్ వాన్ బీక్ 28 పరుగులతో పర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు క్రీజ్ ముందు నిలవలేక పోయారు. ఫలితంగా 41 ఓవర్లకే 205 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో నెదర్లాండ్స్ కథ ముగిసింది. పాక్ బౌలర్లలో హరిస్ రవూఫ్ తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు, హసన్ అలీ రెండు, షాహీన్ షా అఫ్రిది, ఇఫ్లికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీశారు. పాకిస్థాన్ బౌలర్లు పొదుపుగా పరుగులు ఇవ్వడం ద్వారా నెదర్లాండ్స్ బ్యాటర్లను కట్టడి చేశారు.