IPL 2022: బోల్తాపడిన చెన్నై, నాలుగో విజయాన్ని నమోదు చేసిన పంజాబ్, కీలక ఇన్నింగ్స్‌తో కింగ్స్‌కు విజయాన్ని అందించిన శిఖర్‌ ధవన్‌

సోమవారం జరిగిన పోరులో పంజాబ్‌ 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. వాంఖడే మైదానంలో వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలుపొందడం గమనార్హం.

Mayank Agarwal Hails Death Bowling (Photo - IANS)

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన పోరులో పంజాబ్‌ 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. వాంఖడే మైదానంలో వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలుపొందడం గమనార్హం. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (59 బంతుల్లో 88 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. భానుక రాజపక్సే (42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 110 పరుగులు జతచేయడం విశేషం.

కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (18) మరోసారి నిరాశ పరచగా.. లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ (7 బంతుల్లో 19; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. చెన్నై బౌలర్లలో డ్వైన్‌ బ్రేవో రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రాబిన్‌ ఊతప్ప (1), శాంట్నర్‌ (9), శివమ్‌ దూబే (8) విఫలమవగా.. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు (39 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టాడు.

బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా శ్రీరామచంద్రారెడ్డి, ఏకగ్రీవ నియామకం

అయితే కీలక సమయంలో రాయుడు ఔట్‌ కాగా.. ఆఖర్లో జడేజా (21 నాటౌట్‌), మహేంద్రసింగ్‌ ధోనీ (8 బంతుల్లో 12; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌) ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో చెన్నైకి నిరాశ తప్పలేదు. పంజాబ్‌ బౌలర్లలో రబడ, రిషి ధవన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ధవన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా మంగళవారం బెంగళూరుతో రాజస్థాన్‌ తలపడనుంది.