Punjab Kings defeated Mumbai Indians: ముంబై వెన్నువిరిచిన అర్షదీప్, భారీలక్ష్యాన్ని చేధించలేక చతికిల పడ్డ ముంబై ఇండియన్స్, సొంత గ్రౌండ్‌లోనే MIని చిత్తుగా ఓడించిన పంజాబ్
215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Mumbai, April 22: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (Cameron Green) (67; 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)(57; 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో దుమ్మురేపగా రోహిత్ శర్మ(44; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో టిమ్ డేవిడ్(25 నాటౌట్; 13 బంతుల్లో 2సిక్సర్లు) లు జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep) నాలుగు వికెట్లు తీయగా నాథన్ ఎల్లిస్, లియామ్ లివింగ్‌స్టోన్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆ జట్టు ఆరంభం చూస్తే నిజంగా అంత స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. 18 పరుగులకే మాథ్యూ షాట్(11) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. యువ ఆటగాళ్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్(26; 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), అథర్వ తైడే(29; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడడంతో పవర్ ప్లే పూర్తి అయ్యే సరికి పంజాబ్ 58 /1 తో నిలిచింది. ఈ దశలో ముంబై బౌలర్లు విజృంభడంతో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్‌ను అర్జున్ టెండూల్కర్ ఔట్ చేయగా.. లివింగ్ స్టోన్, అథర్వ తైడే లను పీయూష్ చావ్లా ఒకే ఓవర్‌లో ఔట్ చేసి పంజాబ్‌ను గట్టి దెబ్బకొట్టాడు. దీంతో 10 ఓవర్లకు పంజాబ్ స్కోరు 83/4. ఈ దశలో ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను కెప్టెన్ సామ్ కరన్‌తో పాటు హర్ ప్రీత్ సింగ్ భాటియా తీసుకున్నారు.
ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు వేగం నెమ్మదించింది. 15 ఓవర్లకు పంజాబ్ 118/4 తో నిలిచింది. ఈ దశలో పంజాబ్ కనీసం 160 పరుగుల మార్క్ దాటుతుందా అనే అనుమానం కలిగింది. 16వ ఓవర్‌ను అర్జున్ టెండూల్కర్ వేశాడు. ఈ ఓవర్‌లో సామ్ కరన్ ఓ సిక్స్ ఫోర్ కొట్టగా, హర్ ప్రీత్ సింగ్ భాటియా సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. అర్జున్ ఓ నోబాల్ కూడా వేయడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 31 పరుగులు వచ్చాయి. ఇక్కడి నుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన 17వ ఓవర్‌లో 13 పరుగులు, కామెరూన్ గ్రీన్ వేసిన 18 ఓవర్‌లో 25 పరుగులు వచ్చాయి. ధాటిగా ఆడే క్రమంలో భాటియా, కరన్ ఔటైనప్పటికీ ఆఖర్లో జితేశ్ శర్మ విధ్వంసం సృష్టించడంతో పంజాబ్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. ఆఖరి ఐదు ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 96 పరుగులు సాధించింది.