RCB vs CSK Stat Highlights: వరుస ఓటముల తర్వాత చెన్నై విజయం, రాయల్ ఛాలెంజర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచిన ధోనీ సేన, బ్యాటింగ్‌లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.

Ruturaj Gaikwad (Picture Credits: Twitter)

వరుస ఓటములతో ఢీలా పడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎట్టకేలకు (RCB vs CSK Stat Highlights) మరో విజయాన్ని సాధించింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ తడబడలేదు. చెన్నై (Chennai Super Kings) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో65 పరుగులు చేయగా, డుప్లెసిస్ 13 బంతుల్లో 25, అంబటి రాయుడు 27 బంతుల్లో 39 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కోహ్లీ 50, డివిలియర్స్ 39, పడిక్కల్ 22 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించినప్పటికీ దాని స్థానంలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోగా, బెంగళూరును మాత్రం ప్రస్తుతానికి ప్లే ఆఫ్‌కు చేరకుండా అడ్డుకుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు ధాటిగా ఆరంభించారు.అయితే ఆర్సీబీ స్కోరు 31 పరుగుల వద్ద ఉండగా ఫించ్‌(15; 11 బంతుల్లో 3ఫోర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి పడిక్కల్‌(22; 21 బంతుల్లో 2 ఫోర్లు ,1 సిక్స్‌) రెండో వికెట్‌గా చేరడంతో ఆర్సీబీ 46 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఈ సమయంలో విరాట్‌ కోహ్లి-ఏబీ డివిలియర్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.ఈ జోడి 82 పరుగులు జత చేసిన తర్వాత డివిలియర్స్‌(39; 36 బంతుల్లో 4ఫోర్లు) ఔటయ్యాడు.

ఘోర పరాభవంతో ఐపీఎల్ నుంచి చెన్నై ఔట్! ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చతికిల పడిన ధోనీ సేన, 10 వికెట్ల తేడాతో ముంబై జయకేతనం

దీపక్‌ చాహర్‌ వేసిన 18 ఓవర్‌ మూడో బంతికి డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఏబీ ఔటయ్యాడు. అటు తర్వాత మొయిన్‌ అలీ(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. సామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో సాంత్నార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక విరాట్‌ కోహ్లి మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 43 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. స్కోరును పెంచే క్రమంలో 19 ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. ఆ ఓవర్‌ సామ్‌ కరాన్‌ వేయగా డుప్లెసిస్‌ క్యాచ్‌ తీసుకున్నాడు.దాంతో కోహ్లి ఇన్నింగ్స్‌ యాభై పరుగుల వద్ద ముగిసింది. సీఎస్‌కే బౌలర్లలో సామ్‌ కరాన్‌ మూడు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు సాధించాడు. సాంత్నార్‌కు వికెట్‌ దక్కింది.

లక్ష్యచేధనలో చెన్నై ఈ సారి ఆచితూచి ఆడింది. డుప్లెసిస్‌.. సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ కు చేరిన తరువాత రుతురాజ్‌కు అంబటి రాయుడు జత కలవడంతో స్కోరు నెమ్మదిగా పరిగెత్తింది. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు సాధించిన రాయుడు రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.చహల్‌ వేసిన 14 ఓవర్‌ మూడో బంతికి రాయుడు బౌల్డ్‌ అయ్యాడు. వీరిద్దరూ 67 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత రాయుడు ఔట్‌ కాగా, ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. రుతురాజ్‌-ధోనిలు మరో వికెట్‌ పడకుండా బాధ్యతాయుతంగా ఆడటంతో సీఎస్‌కే 18.4 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయం సాధించింది. ధోని 21 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 19 పరుగులు చేశాడు. ఇది సీఎస్‌కేకు నాల్గో విజయం కాగా, ఆర్సీబీకి నాల్గో ఓటమి.