ఐపీఎల్‌లో ప్రతి ఏడాది ఎదురులేకుండా దూసుకువెళ్తున్న చెన్నై ఈ ఏడాది తడబడింది. ఐపీఎల్ ( IPL) చరిత్రలో కని వీని ఎరుగని పరాభవాన్ని మూటగట్టుకుంది. మూడుసార్లు విజేతగా, ఐదుసార్లు రన్నరప్, బరిలోకి దిగిన పది సీజన్లలో ప్రతీసారి కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరిన ఘనత కలిగిన ధోనీ సేన (Chennai Super Kings) ఈ ఏడాది ( Indian Premier League 2020) ఒక్కసారిగా చతికిలపడింది. ముంబై ఇండియన్స్ పై ఘరో పరాభవాన్ని మూటగట్టుకుని ఐపీఎల్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించనుంది. 11 మ్యాచ్‌లలో ఎనిమిదో ఓటమిని ఎదుర్కొన్న ఆ జట్టు ఇక ముందుకు వెళ్లేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది ముంబైకు ఏడో విజయం కాగా, సీఎస్‌కే ఎనిమిదో ఓటమి. దాంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే నిష్క్రమించింది. గత మ్యాచ్‌లో ఓటమితోనే ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు వైదొలిగిన సీఎస్‌కే.. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆ అవకాశాన్ని పూర్తిగా కోల్పోయింది.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ తీసుకోవడంతో సీఎస్‌కే బ్యాటింగ్‌కు దిగింది. సీఎస్‌కే బ్యాటింగ్‌ను రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌లు ఆరంభించారు. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. ఒక్క సామ్ కరాన్ మినహా ఎవరూ ముంబై బౌలర్లను నిలువరించలేకపోవడంతో సీఎస్‌కే తక్కువ స్కోరుకే పరిమితమైంది. సీఎస్‌కే జట్టులో ధోని(16), సామ్ కరాన్(52), శార్దూల్ ఠాకూర్(11)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఈ ముగ్గురిలో కరాన్ ఒక్కడే కాసేపు క్రీజ్‌లో నిలబడి ముంబై బౌలర్లను ప్రతిఘటించాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ నాలుగు వికెట్లు సాధించగా, బుమ్రా, రాహుల్ చాహర్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. కౌల్టర్‌నైల్‌కు వికెట్ దక్కింది.
బౌల్ట్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి డుప్లెసిస్(1) ఔటయ్యాడు. కాగా, బౌల్ట్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి జడేజా(7) సైతం పెవిలియన్ చేరడంతో సీఎస్‌కే పవర్ ప్లే ముగిసేలోపే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఫలితంగా చెత్త రికార్డును సీఎస్‌కే మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే పవర్ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. అయితే కాసేపు ధోని(16) ప్రతిఘటించినా ఏడో ఓవర్‌లో ఔటయ్యాడు. రాహుల్ చాహర్ వేసిన ఏడో ఓవర్ నాల్గో బంతికి డీకాక్ క్యాచ్ పట్టడంతో ధోని నిష్క్రమించాడు. దీపక్ చాహర్(0)ను తమ్ముడు రాహుల్ చాహర్ ఔట్ చేశాడు. ఆపై శార్దూల్ ఠాకూర్(11)ను కౌల్టర్‌నైల్ పెవిలియన్‌కు పంపాడు. దాంతో 71 పరుగుల వద్ద సీఎస్‌కే ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది.
సీఎస్‌కే వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో సామ్ కరాన్ నిలబడ్డాడు. నిప్పులు చెరిగే బంతులతో ముంబై బౌలర్లు విజృంభించిన కరాన్ సొగసై ఇన్నింగ్స్ ఆడాడు. ఏడో స్థానంలో వచ్చిన కరాన్ ఏమాత్రం బెదరకుండా ముంబైను నిలువరించాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఆకట్టుకుని 52 పరుగులు సాధించాడు. దాంతో సీఎస్‌కే తేరుకుంది. 50 పరుగులకే ఆలౌట్ అవుతుందని అనిపించినా కరాన్ ఇన్నింగ్స్‌తో వంద పరుగులు దాటింది. అదే సమయంలో ఆలౌట్ నుంచి కూడా తప్పించుకుంది. కరాన్‌కు తాహీర్(13 నాటౌట్) నుంచి సహకారం లభించడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. బౌల్ట్ వేసిన 20 ఓవర్ ఆఖరి బంతికి కరాన్ బౌల్డ్ అయ్యాడు.
సీఎస్‌కే నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఇషాన్ కిషన్(68 నాటౌట్; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డీకాక్(46 నాటౌట్; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు వికెట్ పడకుండా ఛేదించారు. వీరిద్దరూ 12 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి ముంబైకు ఘనమైన విజయాన్ని అందించారు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; డుప్లెసిస్ (సి) డికాక్ (బి) బౌల్ట్ 1; రాయుడు (సి) డికాక్ (బి) బుమ్రా 2; జగదీశన్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 0; ధోని (సి) డికాక్ (బి) రాహుల్ చహర్ 16; జడేజా (సి) కృనాల్ (బి) బౌల్ట్ 7; స్యామ్ కరన్ (బి) బౌల్ట్ 52; దీపక్ చహర్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చహర్ 0; శార్దుల్ (సి) సూర్యకుమార్ (బి) కూల్టర్‌నైల్ 11; తాహిర్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 114.
వికెట్ల పతనం: 1–0; 2–3; 3–3; 4–3; 5–21; 6–30; 7–43; 8–71; 9–114.
బౌలింగ్: బౌల్ట్ 4–1–18–4; బుమ్రా 4–0–25–2; కృనాల్ 3–0–16–0; రాహుల్ చహర్ 4–0–22–2; కూల్టర్‌నైల్ 4–0–25–1; పొలార్డ్ 1–0–4–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (నాటౌట్) 46; ఇషాన్ కిషన్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (12.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 116.
బౌలింగ్: దీపక్ చహర్ 4–0–34–0; హాజల్‌వుడ్ 2–0–17–0; తాహిర్ 3–0–22–0; శార్దుల్ 2.2–0–26–0; జడేజా 1–0–15–0.