RCB vs MI, IPL 2021 Stat Highlights: మ్యాక్స్‌వెల్ మెరుపులు, హర్షల్ పటేల్ హ్యాట్రిక్ మ్యాజిక్, ముంబైపై విజయంతో ప్లేఆఫ్స్ రేసుకు మరింత చేరువైన కోహ్లీ సేన
వరుసగా ఇక్కడ ఏడు పరాజయాలు ఎదుర్కొన్న కోహ్లీ సేన.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌పై 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హర్షల్ పటేల్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు, చాహల్ 3 వికెట్లతో ముంబై వెన్ను (Harshal Patel Ushers RCB Close to Playoffs) విరిచారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు యూఏఈ గడ్డ పై గెలుపు రుచి చూసింది. వరుసగా ఇక్కడ ఏడు పరాజయాలు ఎదుర్కొన్న కోహ్లీ సేన.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌పై 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హర్షల్ పటేల్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు, చాహల్ 3 వికెట్లతో ముంబై వెన్ను (Harshal Patel Ushers RCB Close to Playoffs) విరిచారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56), కోహ్లీ (42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) అర్ధసెంచరీలు సాధించారు. ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులు చేసి ఈ లీగ్‌లో తొలిసారి ఆర్‌సీబీ (Royal Challengers) చేతిలో ఆలౌటైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు.
రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఛేదనను ముంబయి (Mumbai Indians) ఘనంగానే ఆరంభించింది. డికాక్ (24) వికెట్‌ను కోల్పోయి 9 ఓవర్లలో 75/1తో సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. కానీ పదో ఓవర్లో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్ ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అక్కడి నుంచి ముంబయి ఇన్నింగ్స్ గతి తప్పింది. బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఇషాన్ కిషన్ (9), కృనాల్ (5), సూర్యకుమార్ యాదవ్ (8) చకచకా పెవిలియన్ చేరడంతో ముంబయి 15 ఓవర్లలో 99/5తో ఒత్తిడిలో పడింది.
చివరి అయిదు ఓవర్లలో ముంబయి 67 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయినా పొలార్డ్, హార్దిక్ క్రీజులో ఉండడంతో ముంబయిలో ఆశలు మిగిలే ఉన్నాయి. కానీ చాలా వేగంగా ఆ ఆశలకు తెరపడింది. 17వ ఓవర్లో హర్షల్ వరుస బంతుల్లో హార్దిక్ (3), పొలార్డ్ (7), రాహుల్ చాహర్ (0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించడం ద్వారా బెంగళూరుకు విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరింత చేరువైంది. ఇంకో రెండు విజయాలు సాధిస్తే ఆ జట్టు బెర్తు ఖారారు చేసుకునే అవకాశం ఉంది.
ఈ విజయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తమ బౌలింగ్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. మేం గెలిచిన తీరుపై చాలా ఆనందంగా ఉంది. ఆదిలోనే దేవ్‌దత్ వికెట్ కోల్పోయి మ్యాచ్‌ను ప్రారంభించాం. ఇక బుమ్రా తన బౌలింగ్‌తో ముంబయికి శుభారంభం అందించాడు. అక్కడి నుంచి మ్యాచ్‌లో మా ముద్ర వేయడం అవసరమైంది. నేను బాగా ఆడాను. శ్రీకర్ భరత్ కూడా మంచి సహకారం అందించాడు. దాంతో నాపై ఒత్తిడి తగ్గింది. అనంతరం మాక్స్‌వెల్ ఆడిన తీరు అమోఘం. అయితే, మేం సాధించిన 166 పరుగులు మోస్తరు స్కోరే. ఇక ముంబయి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల తేడాతో మా బౌలర్లు 8 వికెట్లు పడగొట్టడం నమ్మశక్యం కానిది. ఈ ఆటలో మొత్తం మా ప్రదర్శనకు 10 పాయింట్లు ఇస్తే.. బ్యాటింగ్ పరంగా 8 పాయింట్లు ఇస్తా. ఎందుకంటే మేం సుమారు 20 పరుగులు ఎక్కువ సాధించాల్సి ఉండేది’ అని కోహ్లీ వివరించాడు.
ముంబై ఓటమిపై రోహిత్ మాట్లాడుతూ.. మా బౌలింగ్ బాగుందని అనుకుంటున్నా. ఒకస్థితిలో బెంగళూరు 180+ స్కోర్ సాధించేలా కనిపించింది. కానీ, మమ్మల్ని బ్యాట్స్‌మెనే ముంచేశారు. ఈ సీజన్‌లో ఆ సమస్య కొనసాగుతోంది. ఈ విషయంపై బ్యాట్స్‌మెన్ అందరితోనూ మాట్లాడాను. అవసరమైనప్పుడు ఎవరైనా బాధ్యత తీసుకోవాలని చెప్పాను. అయితే, మా బ్యాటింగ్‌లో రెండు, మూడు వికెట్లు పడగానే బెంగళూరు బౌలర్లు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఇకపై బాగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం మాకుంది. అయితే, ఈ సీజన్‌లోనే అది జరగడం లేదు. అలాగే ఇషాన్ కిషన్ మా జట్టులో ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. అతడి సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను ప్రోత్సహించేందుకే సూర్యకుమార్ కన్నా ముందు పంపిస్తున్నాం. అతడిపై మరీ ఒత్తిడి తేవాలనుకోవడం లేదు. అతడు యువ ఆటగాడు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగులు వేస్తున్నాడు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రాయ్ (బి) మిల్నె 51; పడిక్కల్ (సి) డికాక్ (బి) బుమ్రా 0; శ్రీకర్ భరత్ (సి) సూర్యకుమార్ (బి) రాహుల్ చాహర్ 32; మ్యాక్స్‌వెల్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 56; డివిలియర్స్ (సి) డికాక్ (బి) బుమ్రా 11; క్రిస్టియన్ నాటౌట్ 1; షాబాజ్ అహ్మద్ (బి) బౌల్ట్ 1; జేమీసన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-7, 2-75, 3-126, 4-161, 5-161, 6-162; బౌలింగ్: బౌల్ట్ 4-0-17-1; బుమ్రా 4-0-36-3; మిల్నె 4-0-48-1; కృనాల్ 4-0-27-0; రాహుల్ చాహర్ 4-0-33-1
ముంబయి ఇన్నింగ్స్: రోహిత్ (సి) పడిక్కల్ (బి) మ్యాక్స్‌వెల్ 43; డికాక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) చాహల్ 24; ఇషాన్ కిషన్ (సి) హర్షల్ (బి) చాహల్ 9; సూర్యకుమార్ (సి) చాహల్ (బి) సిరాజ్ 8; కృనాల్ (బి) మ్యాక్స్‌వెల్ 5; పొలార్డ్ (బి) హర్షల్ 7; హార్దిక్ (సి) కోహ్లి (బి) హర్షల్ 3; మిల్నె (బి) హర్షల్ 0; రాహుల్ చాహర్ ఎల్బీ (బి) హర్షల్ 0; బుమ్రా (బి) చాహల్ 5; బౌల్ట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (18.1 ఓవర్లలో ఆలౌట్) 111; వికెట్ల పతనం: 1-57, 2-79, 3-81, 4-93, 5-97, 6-106, 7-106, 8-106, 9-111; బౌలింగ్: జేమీసన్ 2-0-22-0; సిరాజ్ 3-0-15-1; క్రిస్టియన్ 2-0-21-0; హర్షల్ పటేల్ 3.1-0-17-4; చాహల్ 4-1-11-3; మ్యాక్స్‌వెల్ 4-0-23-2