RR vs MI Stat Highlights: ముంబైని ఉతికేసిన రాజస్థాన్, బెన్ స్టోక్ మెరుపు శతకంతో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఆకట్టుకున్న హార్థిక్ ఇన్నింగ్స్
ఈ సీజన్‌లో అడపా దడపా విజయాలతో ఢీలా పడ్డ రాజస్తాన్ రాయల్స్ (RR vs MI Stat Highlights Dream11 IPL 2020) ఎట్టకేలకు భారీ విజయాన్ని సాధించింది. ముంబై (Mumbai Indians) నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సునాయాసంగా ఛేదించింది.
ఐపీఎల్-13లో పటిష్ఠ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో అడపా దడపా విజయాలతో ఢీలా పడ్డ రాజస్తాన్ రాయల్స్ (RR vs MI Stat Highlights Dream11 IPL 2020) ఎట్టకేలకు భారీ విజయాన్ని సాధించింది. ముంబై (Mumbai Indians) నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సునాయాసంగా ఛేదించింది.
బెన్ స్టోక్స్(107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్(54 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)లు చెలరేగిపోవడంతో రాజస్తాన్ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.ఈ జోడి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రాజస్తాన్ ( Rajasthan Royals) అలవోకగా జయకేతనం ఎగురవేసింది. ఇది రాజస్తాన్‌కు ఐదో విజయం కాగా, ముంబైకు నాల్గో ఓటమి.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో డీకాక్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు ఆకట్టుకున్నారు. ఈ జోడి 83 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత ఇషాన్ కిషన్(37; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కార్తీక్ త్యాగి వేసిన 11 ఓవర్ నాల్గో బంతికి ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి ఇఫాన్ ఔటయ్యాడు.
దాంతో 90 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్‌గా కోల్పోగా, మరో ఐదు పరుగుల వ్యవధిలో సూర్యకుమార్(40; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) వికెట్‌ను కోల్పోయింది. శ్రేయస్ గోపాల్ వేసిన 13 ఓవర్ రెండో బంతికి షాట్ ఆడిన సూర్యకుమార్.. స్టోక్స్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. పొలార్డ్(6) నిరాశపరిచాడు. చివరి ఓవర్లలో సౌరవ్ తివారీ(34; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్), హార్దిక్ పాండ్యా(60 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు)లు బ్యాట్ ఝుళిపించడంతో భారీ స్కోరు చేసింది.
ఈ మ్యాచ్‌లో 15 ఓవర్లు ముగిసే సరికి ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఇక కార్తీక్ త్యాగి వేసిన 16 ఓవర్‌లో ఐదు పరుగులే వచ్చినా, జోఫ్రా ఆర్చర్ వేసిన 17 ఓవర్‌లో తివారీ రెండు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. దాంతో ఆ ఓవర్‌లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. ఇక రాజ్‌పుత్ వేసిన 18 ఓవర్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టిన హార్దిక్.. నాలుగు, ఐదు, ఆరు బంతుల్ని సిక్స్‌లు కొట్టాడు.
హార్దిక్ హ్యాట్రిక్ సిక్స్‌లు సాధించడంతో ఆ ఓవర్‌లో 27 పరుగులు వచ్చాయి. ఇక ఆర్చర్ వేసిన 19 ఓవర్ తొలి బంతికి సౌరవ్ తివారీ ఔట్ కావడంతో మూడు పరుగులే వచ్చాయి. త్యాగి వేసిన చివరి ఓవర్‌లో హార్దిక్ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టడంతో ముంబై ఇండియన్స్ 27 పరుగులు పిండుకుంది. చివరి ఐదు ఓవర్లలో ముంబై వికెట్ మాత్రమే కోల్పోయి 79 పరుగులు సాధించింది.
టార్గెట్ ఛేదనలో రాబిన్ ఊతప్ప(13;11 బంతుల్లో 2 ఫోర్లు)వికెట్‌ను రాజస్తాన్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. అనంతరం స్టీవ్ స్మిత్(11; 8 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. ఆ తరుణంలో బెన్ స్టోక్స్‌కు జత కలిసిన శాంసన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డ వీరిద్దరూ రాజస్తాన్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. స్టోక్స్ 59 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. పాటిన్‌సన్ వేసిన 19 ఓవర్‌లో తొలి రెండు బంతుల్ని సిక్స్, ఫోర్‌లు కొట్టిన స్టోక్స్ విజయాన్ని ఖాయం చేశాడు.