IPL 2022: హైదరాబాద్‌కు ఏమైంది, వరుసగా రెండో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో పరాజయం, సన్‌రైజర్స్‌ బ్యాటర్ల భరతం పట్టిన లక్నో బౌలర్ అవేశ్‌ ఖాన్‌

సోమవారం జరిగిన రెండో పోరులో (SRH vs LSG Stat Highlights, IPL 2022) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 12 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది

Lucknow Super Giants players celebrate a wicket (Photo credit: Twitter)

చివరి ఓవర్‌ వరకు ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఒత్తిడికి గురైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో మ్యాచ్‌లో (IPL 2022) కూడా పరాజయం పాలైంది. ఐపీఎల్‌ 15వ సీజన్‌ తొలి పోరులో రాజస్థాన్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌.. సోమవారం జరిగిన రెండో పోరులో (SRH vs LSG Stat Highlights, IPL 2022) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 12 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో (Lucknow Super Giants) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (50 బంతుల్లో 68; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), దీపక్‌ హుడా (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. క్వింటన్‌ డికాక్‌ (1), ఎవిన్‌ లూయీస్‌ (1), మనీశ్‌ పాండే (11) వెంటవెంటనే ఔట్‌ కావడంతో ఒక దశలో 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రాహుల్‌, హుడా ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. ఆఖర్లో ఆయుశ్‌ బదోనీ (19 నాటౌట్‌; 3 ఫోర్లు) ధాటిగా ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, షెఫర్డ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండో విక్టరీ సాధించిన గుజరాత్, అదరగొట్టిన బౌలర్స్, రిషబ్ పంత్ పోరాడినా దక్కని గెలుపు

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్‌ ( Sunrisers Hyderabad) 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు కేన్‌ విలియమ్సన్‌ (16), అభిషేక్‌ శర్మ (13) ఎక్కువసేపు నిలువలేకపోగా.. రాహుల్‌ త్రిపాఠి (30 బంతుల్లో 44; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), నికోలస్‌ పూరన్‌ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కాస్త పోరాడారు. చివరి రెండు ఓవర్లలో 26 పరుగులు చేయాల్సిన దశలో వాషింగ్టన్‌ సుందర్‌ (18), షెఫర్డ్‌ (8) ధాటిగా ఆడలేకపోయారు. లక్నో బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 4, జాసెన్‌ హోల్డర్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అవేశ్‌ ఖాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో భాగంగా మంగళవారం రాజస్థాన్‌తో బెంగళూరు తలపడనుంది.

స్కోరుబోర్డు

లక్నో సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్‌ (ఎల్బీ) నటరాజన్‌ 68, డికాక్‌ (సి) విలియమ్సన్‌ (బి) సుందర్‌ 1, లూయిస్‌ (ఎల్బీ) సుందర్‌ 1, మనీశ్‌ పాండే (సి) భువనేశ్వర్‌ (బి) షెఫర్డ్‌ 11, దీపక్‌ హుడా (సి) త్రిపాఠి (బి) షెఫర్డ్‌ 51, ఆయుష్‌ బదోని (రనౌట్‌) 19, క్రునాల్‌ పాండ్యా (బి) నటరాజన్‌ 6, హోల్డర్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 169/7; వికెట్ల పతనం: 1-8, 2-16, 3-27, 4-114, 5-144, 6-150, 7-169; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-25-0, వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-28-2, షెఫర్డ్‌ 4-0-42-2, ఉమ్రాన్‌ మాలిక్‌ 3-0-39-0, అబ్దుల్‌ సమద్‌ 1-0-8-0, నటరాజన్‌ 4-0-26-2.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్‌ శర్మ (సి) పాండే (బి) అవేశ్‌ 13, కేన్‌ విలియమ్సన్‌ (సి) టై (బి) అవేశ్‌ 16, రాహుల్‌ త్రిపాఠి (సి) రవి బిష్ణోయ్‌ (బి) పాండ్యా 44, మార్‌క్రమ్‌ (సి) రాహుల్‌ (బి) పాండ్యా 12, నికోలస్‌ పూరన్‌ (సి) హుడా (బి) అవేశ్‌ 34, వాషింగ్టన్‌ సుందర్‌ (సి) రాహుల్‌ (బి) హోల్డర్‌ 18, అబ్దుల్‌ సమద్‌ (సి) డికాక్‌ (బి) అవేశ్‌ 0, షెపర్డ్‌ (సి) బదోని (బి) హోల్డర్‌ 8, భువనేశ్వర్‌ (సి) డికాక్‌ (బి) హోల్డర్‌ 1, ఉమ్రాన్‌ మాలిక్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 157/9; వికెట్ల పతనం: 1-25, 2-38, 3-82, 4-95, 5-143, 6-143, 7-154, 8-156, 9-157; బౌలింగ్‌: హోల్డర్‌ 4-0-34-3, క్రునాల్‌ పాండ్యా 4-0-27-2, అవేశ్‌ ఖాన్‌ 4-0-24-4, ఆండ్రూ టై 4-0-39-0, రవి బిష్ణోయ్‌ 4-0-29-0.