Ind vs SL 3rd T20I Highlights: చివరి టీ20లో యంగ్ టీమిండియా అద్భుత బ్యాటింగ్.. శ్రీలంక ఘన విజయం, సిరీస్ కైవసం; టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ బయలుదేరనున్న భారత జట్టు
శ్రీలంక జట్టుకు తిరుగులేని సిరీస్ విజయాన్ని కట్టబెట్టి వారిలో స్పూర్థి నింపింది.
Colombo, July 30: బుధవారం జరిగిన రెండో టీ20లో తృటిలో ఓటమి పాలై ఏం పర్వాలేదనిపించుకున్న టీమిండియా, గురువారం జరిగిన చివరి టీ20లో మాత్రం కసితీరా ఓడింది. ఈ క్రమంలో ఎంతోకాలంగా విజయాలు లేక సతమతవుతున్న శ్రీలంక జట్టుకు తిరుగులేని సిరీస్ విజయాన్ని కట్టబెట్టి వారిలో స్పూర్థి నింపింది.
వివరాల్లోకి వెళ్తే, 1-1తో టీ20 సిరీస్ సమం అయిన తర్వాత సిరీస్ ను నిర్ణయించే చివరి టీ20 హోరాహోరీగా సాగుతుందనుకున్నరంతా. ఇదే ఊపులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా పరుగుల కంటే వేగంగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శిఖర్ ధవన్, సంజూ శాంసన్, చక్రవర్తి పరుగులేమి చేయకుండానే డకౌట్లుగా వెనుదిరిగారు. మరోవైపు, శ్రీలంక బౌలర్ హసరంగ విసిరిన బంతులకు 4 వికెట్లు పడగా, 9 పరుగులు మాత్రమే వచ్చాయి. తన కెరియర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద 81 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు ఆడుతూపాడుతూ స్కోర్ చేస్తూ విజయానికి కావాల్సిన 82 పరుగులను 14.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో శ్రీలంక అద్భుత విజయాన్ని అందుకొని 2-1 తేడాతో సిరీస్ తమ సొంతం చేసుకుంది.
ఈసారి శ్రీలంక పర్యటనకు ద్వితీయ శ్రేణి భారత జట్టును పంపడం, అందులో యువకులకు అవకాశం ఇవ్వడం చేశారు. అయినప్పటికీ యంగ్ గన్స్ పేలలేదు, అవకాశాన్ని వినియోగించుకోలేదు. మరోవైపు జట్టులో టీం సభ్యుల్లో ఒకరు కరోనా బారినపడటంతో 9 మంది ఐసోలేషన్ కు వెళ్లారు. మిగిలిన జట్టుతోనే టీమిండియా ఆడింది. ఏదైమైనా ఐపీఎల్ లో భీకరంగా రెచ్చిపోయే కుర్రాళ్లు ఒక దేశం తరఫున ఆడుతున్నప్పడు కనీస పోరాటపటిమ చూపకపోవడం నిరాశ కలిగిస్తుంది, చిన్న పిల్లల ఆటను తలపించింది. ఇక ముందైనా ఆటతీరు మెరుగుపరుచుకుంటారని ఆశిద్దాం.
ఇదిలా ఉంటే, ఈ సిరీస్ తర్వాత టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ బయలుదేరనుంది. ఆగష్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు 5 టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించనున్నాడు.