T20 World Cup 2021: వాళ్లు కొట్టినట్లు మేము సిక్సులు కొట్టలేకపోయాం, అందుకే ఈ ఓటమి, న్యూజిలాండ్ జట్టు మా కన్నా నిలకడగా, ఉత్తమంగా ఆడిందని తెలిపిన ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్
ఈ మ్యాచ్‌లో పూర్తి క్రెడిట్ న్యూజిలాండ్ జట్టుకే ఇవ్వాలి.ఎందుకంటే వాళ్లు మా జట్టుకన్నా బాగా ఆడారు. కివీస్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు.
టి20 ప్రపంచకప్ 2021లో న్యూజిలాండ్ తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ( T20 World Cup semifinal) ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిన న్యూజిలాండ్ తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. తద్వారా 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదుర్కొన్న న్యూజిలాండ్ (New Zealand) తాజా విజయంతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
ఈ ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్.."ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మాకు తెలుసు ప్రత్యర్ధి జట్టు అన్ని విధాలుగా పటిష్టంగా ఉందని.. ఈ మ్యాచ్‌లో పూర్తి క్రెడిట్ న్యూజిలాండ్ జట్టుకే ఇవ్వాలి.ఎందుకంటే వాళ్లు మా జట్టుకన్నా బాగా ఆడారు. కివీస్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. వాళ్ల స్పిన్నర్లు కూడా అద్బుతంగా రాణించారు. ఈ టోర్నీలో మేము కూడా చాలా కష్టపడ్డాం. ఆ క్రెడిట్ అంతా మా బాయ్స్‌కు ఇవ్వాలని తెలిపారు.
ఈ మ్యాచ్‌లో 17వ, 18వ ఓవర్ల వరకు విజయం మావైపే ఉందని అనుకున్నాం. కానీ ఒక్క ఓవర్‌లో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. సాధారణంగా మా జట్టు సిక్స్‌లు బాగా కొట్టగలదు. కానీ ఈ మ్యాచ్‌లో సిక్సర్లు కొట్టడానికి చాలా కష్టపడ్డాము. ప్రత్యర్ధి ముందు మేము మెరుగైన లక్ష్యాన్ని ఉంచాము. కానీ న్యూజిలాండ్ జట్టు మా కన్నా నిలకడగా, ఉత్తమంగా ఆడింది. ముఖ్యంగా జెమ్మీ నీషమ్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు" అని మ్యాచ్ అనంతరం మోర్గాన్ (Eoin Morgan Reacts ) పేర్కొన్నాడు.
Here's England Cricket Tweet
మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇంగ్లండ్‌కు పెద్దగా అవకాశాలివ్వకుండా జాగ్రత్తపడింది. అయితే ఒకటి రెండుచోట్ల ఇంగ్లండ్ ఆటగాళ్లు క్యాచ్‌లు పట్టుకోవడంలోనూ.. ఫీల్డింగ్ మిస్ చేయడంలో విఫలమైంది. ఇక కివీస్ ఓపెనర్ డారెల్ మిచెల్ (72 పరుగులు, 47 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో నీషమ్(11 బంతుల్లో 27 పరుగులు) 3 సిక్సర్లతో హోరెత్తించి న్యూజిలాండ్ విజయానికి బాటలు పరిచాడు. ఇంకో ఓవర్ మిగిలుండగానే న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తమకు ఐసీసీ ప్రపంచకప్‌లను దూరం చేస్తున్న ఇంగ్లండ్‌ను ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో కివీస్ కసిదీరా ఓడించి మరీ ఫైనల్ చేరింది.