Abudabi November 11: టీ-20 వరల్డ్ కప్ సెమీస్‌లో సూపర్ విక్టరీ కొట్టింది కివీస్. ఆరంభంతో తడబడ్డ న్యూజిల్యాండ్ బ్యాట్స్‌మెన్ అనూహ్యంగా పుంజుకొని ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. మిచెల్, నీషమ్ విరుచుకుపడంతో ఇంగ్లండ్ పెట్టిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలిగింది.
ప్రారంభంలోనే కీలకమైన గప్తిల్ (4), కేన్ విలియమ్సన్ (5) వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్ గెలిచే అవకాశం ఉందా? అనే స్థితిలో ఉండగా డారియల్ మిచెల్ (68 నాటౌట్), జేమ్స్ నీషమ్ (11 బంతుల్లో 27) ఆ జట్టును ఒడ్డుకు చేర్చారు.
ముఖ్యంగా నీషమ్ బౌండరీలతో విరుచుపడి కివీస్ విజయానికి బాటలు వేశాడు. దీంతో అతను అవుటయ్యే సమయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. అలాంటి సమయంలో మిచెల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కీలకమైన వికెట్లు తీసిన వోక్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అదే ఓవర్ చివరి బంతికి ఫోర్‌తో కివీస్‌కు విజయాన్నందించాడు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు సంయమనంతో ఆడి, చివర్లో విజృంభించి విజయాన్ని కట్టబెట్టిన డారియల్ మిచెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్‌స్టన్ చెరో రెండు వికెట్లు కూల్చగా, అదిల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో కివీస్ తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం నాడు దుబాయ్‌లో జరిగే ఫైనల్‌లో రెండో సెమీస్ విజేతను న్యూజిల్యాండ్ ఢీకొంటుంది.