T20 World Cup 2021: ఆప్గనిస్తాన్ మీదనే భారత్ సెమీస్ ఆశలు, ఆదివారం న్యూజిల్యాండ్- ఆప్గనిస్తాన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్
దీంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఇప్పుడు భారత్ సెమీస్ వెళ్తుందా? లేదా? అన్నది ఆప్గన్ టీమ్పై ఆధారపడి ఉంది. న్యూజిల్యాండ్తో జరిగే మ్యాచ్లో ఆప్గనిస్తాన్ గెలిస్తే టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
Abu Dhabi, November 06: టీ20 ప్రపంచకప్లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఇప్పుడు భారత్ సెమీస్ వెళ్తుందా? లేదా? అన్నది ఆప్గన్ టీమ్పై ఆధారపడి ఉంది. న్యూజిల్యాండ్తో జరిగే మ్యాచ్లో ఆప్గనిస్తాన్ గెలిస్తే టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ నిర్దేశించిన 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ పవర్‌ఫుల్ ఇన్నింగ్స్ తో టీమ్‌ఇండియా 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే స్కాట్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 7.1 ఓవర్లలో భారత్ ఛేదించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓపెనర్లు దొరికిన బంతిని దొరికినట్లు చితక్కొట్టారు.
టీ-20 సెమీస్ కోసం జరిగే మ్యాచ్‌లో అఫ్గాన్ విజయం భారత్‌కు మాత్రమే కాదు, ఆ టీమ్‌కు కూడా ఎంతో అవసరం. ఎందుకంటే ఆ జట్లు కూడా సెమీస్ రేసులో ఉంది. గ్రూప్- 2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్‌తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన కివీస్, ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాల చొప్పున సాధించిన భారత్, అఫ్గానిస్థాన్ చెరో 4 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ముందంజ వేసే అవకాశం కివీస్‌కే ఎక్కువగా ఉంది. ఆ జట్టు తన చివరి గ్రూపు మ్యాచ్‌లో ఆదివారం అఫ్గానిస్థాన్‌తో తలపడుతుంది. విజయం సాధిస్తే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ సెమీస్‌కు వెళ్తుంది. ఒకవేళ ఆఖరి మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తే న్యూజిలాండ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కివీస్ కంటే అఫ్గాన్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. అయితే ఆ జట్టు సెమీస్ అవకాశాలు భారత్‌పై ఆధారపడివుంటాయి. ఇక సూపర్-12లో ఆఖరి మ్యాచ్‌లో నమీబియాతో భారత్ ఆడనుంది. కివీస్‌ను అఫ్గాన్ ఓడించినప్పటికీ ఆ జట్టు రన్‌రేట్ పెద్దగా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే అఫ్గాన్ కంటే మెరుగైన రన్‌రేట్ కలిగిన భారత్ విజయం సాధిస్తే ముందంజ వేయొచ్చు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆప్గాన్, న్యూజిల్యాండ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.