T20 World Cup 2024: పాకిస్తాన్ కొంప ముంచిన సూపర్ ఓవర్, రెండు వరుస విజయాలతో యూఎస్ఏ దూకుడు, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో పరాభవంతో టోర్నీ ప్రారంభించిన దాయాది దేశం

గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో యూఎస్‌ఏ ‘సూపర్‌ ఓవర్‌’లో 5 పరుగులతో పాక్‌ను ఓడించింది.

USA Team

టి20 ప్రపంచకప్‌ టోర్నీ 11వ మ్యాచ్‌లో ‘సూపర్‌ ఓవర్‌’ ద్వారా పాకిస్తాన్ తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో యూఎస్‌ఏ ‘సూపర్‌ ఓవర్‌’లో 5 పరుగులతో పాక్‌ను ఓడించింది. దాయాది దేశం ఓటమితో టోర్నీని ప్రారంభించగా తొలి మ్యాచ్‌లో కెనడాపై నెగ్గిన యూఎస్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

పాక్‌ తరఫున ఆమిర్‌ వేసిన సూపర్‌ ఓవర్లో అమెరికా 18 పరుగులు చేయగా... గెలవాలంటే ‘సూపర్‌ ఓవర్‌’లో 19 పరుగులు చేయాల్సిన పాక్‌... అమెరికా బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ వేసిన సూపర్‌ ఓవర్లో ఒక వికెట్‌ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.  పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో ఘోర పరాభవం పొందిన జట్లు ఇవే, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన యూఎస్‌ఏ

అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (43 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్‌ ఖాన్‌ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించగా... షాహిన్‌ అఫ్రిది (16 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో కీలక పరుగులు చేశాడు. అమెరికా బౌలర్లలో నాస్తుష్‌ కెన్‌జిగే 3 వికెట్లు పడగొట్టగా, సౌరభ్‌ నేత్రావల్కర్‌ 2 వికెట్లు తీశాడు.

అనంతరం అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు సాధించింది. కెప్టెన్ మోనాంక్‌ పటేల్‌ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఆరోన్‌ జోన్స్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గూస్‌ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఒక దశలో చేతిలో 9 వికెట్లతో 8 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన మెరుగైన స్థితిలో నిలిచిన అమెరికా ఆ తర్వాత పాక్‌ బౌలింగ్‌ ముందు తడబడింది.

అయితే 19వ ఓవర్‌ వరకు పట్టు బిగించిన పాక్‌...చివరి ఓవర్లో వెనుకంజ వేసింది. రవూఫ్‌ వేసిన ఈ ఓవర్లో గెలుపు కోసం 15 పరుగులు చేయాల్సి ఉండగా యూఎస్‌ ఫోర్, సిక్స్‌ సహా 14 పరుగులు రాబట్టింది. ఫలితంగా మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ కు దారి తీసింది.