2021 Copa América Final: 28 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు 15వ కోపా అమెరికా టోర్నీ విజేతగా నిలిచిన అర్జెంటీనా, అత్యధిక టైటిళ్లు గెలిచి ఉరుగ్వే సరసన నిలిచిన మెస్సీ టీం, పోరాడి ఓడిన బ్రెజిల్
కోపా అమెరికా ఫైనల్లో (2021 Copa América Final) బ్రెజిల్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. 15వ సారి కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకుని అత్యధిక టైటిళ్లు గెలిచిన ఉరుగ్వే సరసన చేరింది.
కోపా అమెరికా 2021 టోర్నీ విజేతగా అర్జెంటీనా నిలిచింది. కోపా అమెరికా ఫైనల్లో (2021 Copa América Final) బ్రెజిల్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. 15వ సారి కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా కైవసం చేసుకుని అత్యధిక టైటిళ్లు గెలిచిన ఉరుగ్వే సరసన చేరింది. నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 గోల్ తేడాతో ప్రత్యర్థి బ్రెజిల్‌పై విజయం సాధించింది. ఏంజెల్ డీ మారియా సాధించిన గోల్ అర్జెంటీనాను విజేతగా నిలబెట్టింది.
28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు ఓ మేజర్ టోర్ని టైటిల్ అందించాడు మెస్సీ. ఇదే మెస్సీకి మొదటి కోపా టైటిల్ కూడా. అంతేగాక మెస్సీ కెరీర్‌లోనే ఇదే మొదటి అంతర్జాతీయ టైటిల్ కావడం గమనార్హం. దీంతో తన సారథ్యంలో దేశానికి ఓ అంతర్జాతీయ టైటిల్ తెచ్చిపెట్టాలనే మెస్సీ కల (Lionel Messi’s Lifelong Dream Turns Into Reality) నెరవేరింది. ఆ దేశానికి చెందిన దిగ్గజ ఆటగాడు మారడోనా నేతృత్వంలో కూడా అర్జెంటీనా కోపా టైటిల్ గెలవలేదు.1937లో తొలిసారి కోపా కప్ గెలిచిన అర్జెంటీనా.. చివరిసారిగా 1993లో ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడే ఆ ఫీట్‌ను రిపీట్ చేసింది.
అద్భుతమైన జట్టుగా పేరున్నప్పటికీ ఈ ట్రోఫీని దాదాపు ఎత్తడానికి 28 ఏళ్ల పాటు అర్జెంటీనా ఎదురుచూసింది. మారడోనా లాంటి దిగ్గజానికి సైతం కలగా మిగిలిపోయిన చోట ఎట్టకేలకు అర్జెంటీనా కోపా అమెరికా 2021 టోర్నీ కైవసం చేసుకుని టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇంతకుముందు అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. పీలే బ్రెజిల్ కెప్టెన్‌గా ఉన్న టైంలోనూ బ్రెజిల్ కోపాను గెల్చుకోలేకపోయింది.
Here's Emotional Video
ఫైనల్లో (Argentina vs Brazil) అర్జంటీనా ఆటగాడు ఏంజిల్ డి మారియా 22వ నిమిషంలో గోల్ చేయడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు మెస్సీ కూడా 88వ నిమిషంలో ఓ గోల్ చేయడానికి ప్రయత్నించినా ప్రత్యర్థి జట్టు గోల్‌కీపర్ ఎడర్సన్ దాన్ని అడ్డుకున్నాడు. దాంతో ఫైనల్లో ఈ స్టార్ ప్లేయర్ గోల్ చేయలేకపోయాడు. మొత్తంగా ఈ టోర్నీలో మెస్సీ నాలుగు గోల్స్ సాధించి బ్రెజిల్ స్టార్ నెయ్‌మర్‌తో సమానంగా నిలిచాడు. వీరిద్దర్నీ అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎంపికచేశారు. ఏకైక గోల్ సాధించిన ఏంజిల్ డి మారియా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇక మ్యాచ్ పూర్తయ్యే సమయానికి అర్జెంటీనాను విజేతగా ప్రకటించగా మెస్సీ ఉద్వేగానికిలోనయ్యాడు. సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చాడు. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెస్సీని గాల్లోకి ఎగరవేస్తూ సంబరాలు చేసుకున్నారు.
దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్‌లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్..అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువ జామున రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు Ángel Di María చేసిన గోల్ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఇక బ్రెజిల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా అర్జెంటీనా ఆటగాళ్లు కట్టడి చేయగలిగారు. దీంతో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా టీం 15వ కోపా అమెరికా ట్రోఫీని ఎత్తి సంబురాలు చేసుకుంది.
ఓవైపు ఓటమి భారంతో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మర్ దా సిల్వ శాంటోస్ శోకంతో ఏడుస్తుంటే.. మరోవైపు మెస్సీ నేతృత్వంలో అర్జెంటీనా తొలి కప్పు సాధించడంతో Lionel Messi భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకున్నారు.