
Newdelhi, Mar 9: గతకొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు సమయం దగ్గర పడుతోంది. నేటి చివరి ఆట కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీ పోరుకు సిద్దమవుతున్నాయి. మెగా ఫైనల్ (Champions Trophy Final) కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. 2013లో చివరి సారిగా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోగా.. 2000 ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ ను ఓడించి కివీస్ కప్ సొంతం చేసుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్-న్యూజిలాండ్ 16 మ్యాచ్ లలో తలపడగా అందులో న్యూజిలాండ్ 10-6 తేడాతో ఆధిక్యంలో ఉంది.
భారత్ కు షాక్
భారత్ (India), న్యూజిలాండ్ (Newzealand) జట్ల మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions trophy) ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కి గాయమైంది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ ను ఎదుర్కొంటున్న కోహ్లీ మోకాలి కింది భాగంలో బంతి బలంగా తగిలింది. దాంతో ఆయన ప్రాక్టీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కోహ్లీకి తగిలింది తీవ్ర గాయమేమీ కాదని, ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఆయన పూర్తి ఫిట్‌గా ఉన్నాడని కోచింగ్ సిబ్బంది స్పష్టం చేశారు. అయితే, కోహ్లీ ఫిట్ నెస్ పై అభిమానులు ఒకింత ఆందోళనగా ఉన్నారు.
విన్నర్ తేలాల్సిందే..
నేటిఫైనల్ మ్యాచ్ ఒకవేళ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా టై అయితే మరో సూపర్ ఓవర్ పెడతారు. అందులో కూడా ఫలితం రాకపోతే ఇంకో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఇలా రిజల్ట్ వచ్చేంత వరకు, క్లీన్ విన్నర్ ఎవరో తేలేంత దాకా సూపర్ ఓవర్స్ పెడతూనే ఉంటారు. ఒకవేళ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం (మార్చి 10) నాడు తిరిగి మ్యాచ్ కొనసాగిస్తారు. కానీ వరుణుడి బీభత్సంతో మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్-న్యూజిలాండ్‌ను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అప్పుడు రెండు టీమ్స్ ట్రోఫీని పంచుకోవాల్సి ఉంటుంది.
ప్రైజ్ మనీ ఇలా..
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy Final) విజేతగా నిలిచే జట్టు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($2.24 మిలియన్) లభిస్తాయి. ఫైనల్లో ఓడిపోయిన జట్టు రూ. 9.74 కోట్లు ($1.12 మిలియన్) పొందుతుంది.
మల్టీప్లెక్స్ లలో మ్యాచ్ ప్రసారం
కాగా ఎన్నడూలేని విధంగా మల్టీప్లెక్స్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది(IPL 2025). భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ లోని పలు మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ పూర్తయ్యాయి. వినూత్న అనుభవం కోసం క్రికెట్ అభిమానుల నిరీక్షిస్తున్నారు.