Tokyo Olympic Games 2020: ఈ సారి ఏకంగా స్వర్ణ పతకమేనా.., ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత రెజ్లర్ రవి కుమార్ దహియా, పురుషుల 57కేజీల కేటగిరీలో నురిస్లామ్ సానాయేవ్‌పై అనూహ్య విజయం
టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympic Games 2020) పోటీ పడుతున్న భారత రెజ్లర్ రవి కుమార్ దహియా(23) తాజాగా ఫైనల్స్‌లో అడుగు పెట్టి భారత్‌కు కనీసం రజత పతకాన్ని (Ravi Kumar Dahiya Assured of Silver Medal) ఖాయం చేశాడు.
పీవీ సింధు కాంస్య పతకంతో పులకించిపోతున్న భారత క్రీడాభిమానులకు మరో శుభవార్త. టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympic Games 2020) పోటీ పడుతున్న భారత రెజ్లర్ రవి కుమార్ దహియా(23) తాజాగా ఫైనల్స్‌లో అడుగు పెట్టి భారత్‌కు కనీసం రజత పతకాన్ని (Ravi Kumar Dahiya Assured of Silver Medal) ఖాయం చేశాడు. పురుషుల 57కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన దహియా సెమీఫైనల్స్‌లో కజికిస్థాన్‌కు చెందిన నురిస్లామ్ సానాయేవ్‌పై అనూహ్య విజయం సాధించాడు.
బుధవారం 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీఫైనల్లో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై రవికుమార్ విక్టరీ బైఫాల్ కింద గెలుపొందాడు. ఇక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ పురుషుల విభాగంలో పతకం తీసుకొచ్చిన మూడో రెజ్లర్‌గా రవికుమార్ నిలవనున్నాడు. ఇంతకముందు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లు రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు పతకాలు అందించారు.
అయితే యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకోగా.. సుశీల్ కుమార్ మాత్రం ఫైనల్లో ఓడిపోయి రజతం దక్కించుకున్నాడు. తాజాగా సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ చేరిన రెండో వ్యక్తిగా రవికుమార్ దహియా నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒలింపిక్స్‌లో పతకం తెచ్చిన ఐదో రెజ్లర్‌గా నిలవనున్నాడు. కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్(కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం) నలుగురు ఉన్నారు.
సెమీఫైనల్ మ్యాచ్‌లో ఒక దశలో ప్రత్యర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమయంలో రవికుమార్ అతన్ని రింగ్ బయటకు తోసే క్రమంలో నూరిస్లామ్ కాలికి గాయమైంది. కాలికి కట్టుకొని మళ్లీ రింగులోకి వచ్చినా.. అతడు రవికుమార్ పట్టుకు నిలవలేకపోయాడు. దీంతో రిఫరీ రవికుమార్‌ను విక్టరీ బై ఫాల్ కింది విజేతగా ప్రకటించాడు. రవికుమార్ ఫైనల్ చేరడంతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది.