Tokyo Olympics 2020: ఒలింపిక్స్ క్రీడలపై కరోనా పడగ, తాజాగా ఇద్దరికి కోవిడ్ పాజిటివ్, తాజా కేసులతో మూడుకు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, ఒలింపిక్ గ్రామంలో కరోనా కలకలం రేగడం పట్ల ఆందోళన

ఒలింపిక్స్ విలేజ్‌లో ఉంటున్న మరో ఇద్దరు అథ్లెట్లు కరోనా (Two Athletes Reportedly Test Positive) బారిన పడ్డట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది

Tokyo Olympics Banner (Photo Credits: Twitter)

ఒలింపిక్స్ క్రీడలపై కరోనా నీడ క్రమంగా విస్తరిస్తోంది. ఒలింపిక్స్ విలేజ్‌లో ఉంటున్న మరో ఇద్దరు అథ్లెట్లు కరోనా (Two Athletes Reportedly Test Positive) బారిన పడ్డట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. అక్కడి సహాయక సిబ్బందిలో ఒకరు కరోనా బారినపడ్డట్టు వెల్లడైన మరుసటి రోజే ఇద్దరు క్రీడాకారులు పాజిటివ్‌గా తేలడం ప్రస్తుతం ఒలింపిక్స్ (Tokyo Olympics 2020) నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. కాగా ఈ నెల 23న జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, క్రీడాకారులు బస చేసే ఒలింపిక్ గ్రామంలో మరో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో క్రీడలు జరుగుతాయా లేదా అనే ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందటే ఓ అథ్లెట్ కరోనా బారినపడడం తెలిసిందే. దాంతో ఒలింపిక్ విలేజ్ లో కరోనాతో బాధపడుతున్న అథ్లెట్ల సంఖ్య మూడుకు చేరింది. ఈ ముగ్గురు ఒకే దేశానికి చెందిన వారని, అది కూడా వీరంతా ఒకే క్రీడాంశంలో పాల్గొనే అథ్లెట్లు అని టోక్యో ఒలింపిక్స్ అధికార ప్రతినిధి మాసా టకాయా తెలిపారు. వారిని వారి గదుల్లోనే ఐసోలేషన్ లో ఉంచామని, ఒలింపిక్స్ నిర్వాహకులే వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు.

స్వర్ణ పతకం గెలిస్తే రూ. 6 కోట్లు, రజతం కొడితే రూ. 4 కోట్లు, కాంస్య పతకధారికి రూ. 2 కోట్లు, బంపరాఫర్ ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 

ప్రపంచ దేశాల నుంచి టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చే అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఓ టౌన్ షిప్ వంటి గృహసముదాయంలో బస ఏర్పాటు చేశారు. ఇందులో భారీ అపార్ట్ మెంట్ తరహా భవనాలు ఉంటాయి. వీటిలో 6,700 మంది అథ్లెట్లు బస చేస్తారని అంచనా. ఇన్ని వేలమంది ఉండే ఈ ఒలింపిక్ గ్రామంలో (COVID-19 in Olympic Village) కరోనా కలకలం రేగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరో ఐదు రోజుల్లో ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఒలింపిక్ గ్రామంలో ఇంకెన్ని పాజిటివ్ కేసులు బయటపడతాయోనని భయపడుతున్నారు.

గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాదికి వాయిదాపడ్డాయి. ఓవైపు జపాన్ లో కొత్త వేరియంట్లు వెలుగుచూస్తున్నప్పటికీ ఒలింపిక్స్ జరపాలని అక్కడి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకే ప్రేక్షకులను అనుమతించకుండా క్రీడోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. కానీ అథ్లెట్లలోనే కరోనా కేసులు రావడంతో ఒలింపిక్స్ క్రీడలపై సందేహాలు ముసురుకుంటున్నాయి. క్రీడాకారుల విడిది కోసం సిద్ధం చేసిన క్రీడా గ్రామంలో ఏకంగా 6700 మంది అథ్లెట్లు, అధికారులు, సహాయక సిబ్బంది నివసించేందుకు అవకాశం ఉంది. ఆటగాళ్ల ఆరోగ్యంపై జాగ్రత్తగా వ్యవహరిస్తామని, కరోనా విజృంభించకుండా అప్రమత్తంగా ఉంటామని ఛీఫ్‌ ఆర్గనైజర్‌ సెయికో హషిమోటో చెప్తున్నారు.