Konaseema Riots: కోనసీమ అల్లర్లు, 46 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, బస్సును దగ్ధం చేసిన కేసులో 46 మందిపై మరో ఎఫ్‌ఐఆర్ అమలాపురం పీఎస్‌లో నమోదు
ఈ ఘటనలో పోలీసులు వాహనాలు ధ్వంసం అవ్వడమే కాకుండా పలువురు పోలీసులు ఆందోళనకారుల దాడిలో గాయపడిన సంగతి విదితమే. అమలాపురంలో పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో (Konaseema Riots) 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Amalapuram, May 26: కోనసీమలో విధ్వంసకారులు విధ్వంసం రేపిన సంగతి విదితమే. ఈ ఘటనలో పోలీసులు వాహనాలు ధ్వంసం అవ్వడమే కాకుండా పలువురు పోలీసులు ఆందోళనకారుల దాడిలో గాయపడిన సంగతి విదితమే. అమలాపురంలో పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో (Konaseema Riots) 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 307,143,144,147,148,151,152, 332, 336,427,188, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో 75 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సామర్లకోటకు చెందిన హోంగార్డ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు. వడగాన నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, దున్నాల దిలీప్, అడపా శివ, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్, లింగోలు సతీష్, నల్ల నాయుడు, నక్కా హరి, కిశోర్, అడపా సత్తిబాబు, నల్ల రాంబాబు, యాళ్ల రాధ, గాలిదేవర నరసింహమూర్తి, సంసాని రమేష్, కడాలి విజయ్, తోట గణేష్, అన్యం సాయి, దూలం సునీల్, కల్వకొలను సతీష్, కానిపూడి రమేష్, ఈదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పోలిశెట్టి కిషోర్, నల్లా కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మద్దిశెట్టి ప్రసాద్, వినయ్, శివ, సాధనాల మురళీ, నల్లా అజయ్, వాకపల్లి మణికంఠ, కాసిన ఫణీంద్ర, కొండేటి ఈశ్వర్‌రావు, అరిగెల తేజ, అరిగెల వెంకటరామారావు, రాయుడు స్వామిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి కొందరి కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఇక ఎర్ర వంతెన వద్ద బస్సును దగ్ధం చేసిన కేసులో (Amalapuram riots) 46 మందిపై మరో ఎఫ్‌ఐఆర్ అమలాపురం పీఎస్‌లో నమోదు చేశారు. 341,143, 144,147,148,151,336,435,188,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ గిరిబాబు ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
చంద్రబాబు దివాళాకోరు రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తమ మంత్రి, ఎమ్మెల్యేపై తాము దాడి చేయిస్తామా అని ప్రశ్నించారు. మామపై రాళ్లు వేయించి.. అల్లర్లు సృష్టించిన చరిత్ర మాది కాదన్నారు. అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉంది. అల్లర్ల వెనుక ఎవరున్నారో వెలికితీస్తామని’’ మంత్రి బొత్స అన్నారు. పవన్‌కల్యాణ్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. తుని ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రతిపక్షాలు కోరలేదా? ప్రభుత్వంపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి బొత్స హెచ్చరించారు.
అమలాపురంలో అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. బుధవారం అమలాపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కోనసీమ సాధన సమితి పేరుతో ఎవరైతే ర్యాలీకి పిలుపు ఇచ్చారో వారే దీనికి బాధ్యత వహించాలన్నారు. కోనసీమ ప్రజలు, అమలాపురం పట్టణ ప్రజలు చాలా మంచివారని, శాంతి కాముకులని అన్నారు.
శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో కొంతమంది రౌడీషీటర్లు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఒక ఉద్యమాన్ని డైవర్ట్ చేసి.. తన ఇంటిపైన, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైన దాడి చేసి ఇళ్లు తగులబెట్టారని చెప్పారు. పొన్నాడ సతీష్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పంటించారన్నారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉండటంతో వెంటనే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారని తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, కోనసీమ చరిత్రలో 50 ఏళ్లలో ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదన్నారు. కోనసీమ సాధన సమితి వారికి గానీ, విద్యార్థులకు గానీ తమ ఇళ్లపై దాడి చేయడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. రౌడీషీటర్లు పెట్రోల్‌తో వచ్చారని, వాళ్లు ఇంటిని, తన ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి చేసి తగులబెట్టారన్నారు.
కానీ.. సతీష్ ఇంటికి కేవలం పది మీటర్ల దూరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఈ ఘటనలో ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు ఉన్నారని, వారి పేర్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వాళ్ల కాల్‌డేటా బయటకు వస్తుందని, ఐక్యవేదిక ముసుగులో తమ పార్టీ నాయకులను ఎవరు సంప్రదించారో వాళ్ల వివరాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజలెవరూ రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు.