Konaseema Violence: విధ్వంసం నుంచి కోలుకున్న కోనసీమ, పరిస్థితులు అదుపులోకి, దుశ్చర్యలకు పాల్పడ్డ వారిపై పోలీసులు ఉక్కుపాదం, పలువురు అరెస్ట్, మరికొందరిపై కేసులు నమోదు

కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిన విధ్వంసకారుల దుశ్చర్యలతో అట్టుడికిన కోనసీమలో (Konaseema Violence) బుధవారం ప్రశాంత వాతావరణం నెలకొంది

amalapuram Tension (Photo-Video Grab)

Amalapuram, May 26: కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిన విధ్వంసకారుల దుశ్చర్యలతో అట్టుడికిన కోనసీమలో (Konaseema Violence) బుధవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. జిల్లాలో పెద్దఎత్తున మోహరించిన పోలీసు బలగాలు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. దీంతో మంగళవారం నాటి విధ్వంసం తర్వాత 24 గంటల్లోపల సాధారణ పరిస్థితులు నెలకొని జనజీవనం యథావిధిగా సాగుతోంది.కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం (Amalapuram Tesnion) సహా పరిసర ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.

మంగళవారం రాత్రి నుంచి నిలిపివేసిన ఆర్టీసీ బస్సులను బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పునరుద్ధరించారు. అమలాపురంలో వ్యాపార లావాదేవీలతో పాటు, ఇంటర్, డిగ్రీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరిగాయి. చలో రావులపాలెం పిలుపు ఉందని, ఆందోళనకారులు మళ్లీ అటు వైపు ర్యాలీగా వెళ్లనున్నారనే పుకార్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారం అయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, ప్రజల భయాందోళనల నేపథ్యంలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు.

విధ్వంసానికి పాల్పడ్డ దుండగులను పట్టుకునేందుకు క్షేత్ర స్థాయిలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. మంగళవారం నాటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. దుండగులను గుర్తించేందుకు ఎనిమిది పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ఘటనలు జరిగిన ప్రాంతాల్లో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీలు, సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

కోనసీమలో నిప్పు రాజేసిందే వాళ్లే, ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మంత్రి బొత్స, ప్లాన్‌ ప్రకారమే అమలాపురంలో విధ్వంసమని తెలిపిన సజ్జల, మంటల్లో కాలిపోయిన ఇంటిని పరిశీలించిన విశ్వరూప్

ఇందుకోసం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సుమారు 50 మంది పోలీసులతో ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేశారు. సంఘటనలకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై కుట్ర పూరితంగా అల్లర్లు సృష్టించడం ద్వారా అశాంతికి కారణమవ్వడం, పెట్రోలు డబ్బాలతో విధ్వంస రచన, హత్యాయత్నం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల దగ్ధం, 144, 30 సెక్షన్ల ఉల్లంఘన తదితర 12 సెక్షన్లతో ప్రాథమికంగా కేసులు నమోదు చేశారు.

ఇప్పటికే ఉద్యమానికి (Konaseema district renaming row) తొలుత పిలుపునిచ్చిన కోనసీమ పరిరక్షణ సమితి ప్రతినిధి ఎర్రమిల్లి నాగసుధకొండ సహా ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ నెల 20న జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టవద్దంటూ చేపట్టిన ఆందోళనలో అమలాపురం కలెక్టరేట్‌ వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంటానని హల్‌చల్‌ చేసిన అన్యం సాయి సహా పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారికంగా మొత్తం 72 మందిని అదుపులోకి తీసుకోగా 46 మందిని అరెస్ట్ చేశారు. అయితే ప్రాథమిక సమాచారం మేరకు ఆందోళనలో పాల్గొన్న 320 మందిపై కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగే కొద్దీ ఈ సంఖ్య వేలల్లోకి వెళ్లే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

రాష్ట్ర అదనపు డీజీపీ శంకర్‌బక్షి, ఏలూరు రేంజ్‌ డీఐజీ జి.పాలరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలు ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఐశ్యర్య రస్తోగి, ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌ విశాల్‌గున్నీ తదితర పోలీసు ఉన్నతాధికారులు అమలాపురంలో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అమలాపురం పట్టణం నలువైపులా పోలీస్‌ పికెట్‌లు ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనలు చోటు చేసుకున్న ఎర్రవంతెన, నల్లవంతెన, కలెక్టరేట్, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల వద్ద అదనపు బలగాలతో కాపలా కాస్తున్నారు.

ఆందోళనకారులు నిప్పుపెట్టిన రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పొన్నాడ సతీశ్‌ కుమార్‌ ఇళ్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులు, జరిగిన నష్టంపై పోలీసు అధికారులు స్థానికులను విచారించారు. విధ్వంసంతో బెంబేలెత్తిపోయిన కోనసీమ ప్రజలకు మనోధైర్యం కల్పించే దిశగా సివిల్, ఏపీఎస్పీకి చెందిన 22 బెటాలియన్‌ల పోలీసులు అమలాపురం పట్టణంలో కవాతు నిర్వహించారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, డీఎస్పీ రవిప్రకాష్, ఇన్‌స్పెక్టర్‌లు, సబ్‌ ఇనస్పెక్టర్‌లతో కలిపి మొత్తం 30 మంది పోలీసులు కోలుకుంటున్నారు.



సంబంధిత వార్తలు