Amaravati Inner Ring Road Case: అమరావతి రింగ్‌రోడ్డు కేసు, నారా లోకేష్ సీఐడీ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

ఈ కేసులో లోకేశ్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది

Nara Lokesh (Photo/TDP)

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సీఐడీ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో లోకేశ్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేశ్‌ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

లోకేశ్ తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. హెరిటేజ్‌ సంస్థలో లోకేశ్‌ షేర్‌ హోల్డర్‌ అని, ఆయనకు తీర్మానాలు ఇవ్వాలన్నా, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వాలన్నా కంపెనీ ప్రొసీజర్‌ ఉంటుందని కోర్టుకు వివరించారు. లోకేశ్‌ను ఇవి అడగడం సమంజసం కాదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు.

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట, క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా, కోర్టులో వాదనలు ఇవిగో..

దీనిపై స్పందించిన పోసాని అంత తొందరేముందని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం అక్టోబరు 10న సీఐడీ విచారణకు లోకేశ్‌ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేశ్‌కు సీఐడీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఫైబర్‌ నెట్‌ కేసులో లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. లోకేశ్‌ను అరెస్టు చేస్తారనే ఆందోళన తమకు ఉందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఫైబర్‌ నెట్‌ కేసులో లోకేశ్‌ను నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఒకవేళ చేరిస్తే లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 41ఏ నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామని లోకేశ్‌ తరఫు న్యాయవాది అన్నారు. దీంతో లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణను ముగించింది.