AP Assembly Winter Session 2020: అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్, చంద్రబాబుపై ఏపీ సీఎం సెటైర్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, వ్యవసాయరంగంపై కొనసాగిన చర్చ
గతంలో తీవ్ర చర్చకు దారితీసిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ (Andhra Pradesh Assembly Winter Session 2020) నేడు ఆమోదం తెలిపింది. అయితే, బిల్లుపై చర్చ జరగనిదే ఎలా ఆమోదిస్తారని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సీఎం జగన్ స్పందించారు.
Amaravati, Nov 30: ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు హాట్ హాట్ గా మారాయి. గతంలో తీవ్ర చర్చకు దారితీసిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ (Andhra Pradesh Assembly Winter Session 2020) నేడు ఆమోదం తెలిపింది. అయితే, బిల్లుపై చర్చ జరగనిదే ఎలా ఆమోదిస్తారని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సీఎం జగన్ స్పందించారు.
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై గత సమావేశాల్లోనే చర్చ జరిగిందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో (Andhra Pradesh Assembly) ఆమోదం పొందిన బిల్లును మండలికి పంపిస్తే దాన్ని వారు తిప్పి పంపారని, అందువల్ల మళ్లీ తిరస్కరించేందుకు వీల్లేదని అన్నారు.
ఇక్కడ 151 మంది సభ్యులున్న ప్రభుత్వం గతంలో ఏం ఆమోదించిందో, దాన్నే తిరిగి ఆమోదిస్తున్నాం. ఇది లాంఛనం మాత్రమే. ఇదేదో కొత్తగా ప్రవేశపెడుతున్నట్టు టీడీపీ వాళ్లు ప్రవర్తిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు చేయకుండా చూడడం కోసం ఈ చట్ట సవరణ చేశాం. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు ఖర్చు పెడితే వారిపై చర్య తీసుకోవడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. విపక్ష నేత ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడం లేదు" అని సీఎం జగన్ సెటైర్ వేశారు ఇదిలా ఉంటే ఈ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగకుండానే ఆమోదింప చేసుకున్నారంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ (TDP members walkout) చేశారు.
వ్యవసాయ రంగంపై చర్చ
వ్యవసాయ రంగంపై మంత్రి కన్నబాబు చర్చ చేపట్టారు.వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు సభ ముందు పూర్తి వివరాలు ఉంచారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీకి అమరావతి రైతులే తప్ప మిగతా రైతులు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబులా నటించడం తమ ముఖ్యమంత్రికి రాదని టీడీపీకి చురక అంటించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. అధికారంలోకి రాగానే రైతు పక్షపాతినని సీఎం జగన్ ప్రకటించారని గుర్తుచేశారు.
రైతులకు ఉచితంగా బోర్లు, మోటార్లు, పైపులు ఇస్తున్నామన్నారు. పంటల కొనుగోలుకు రూ.3,200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, సహకార రంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పరిపాలకుడు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.
రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారు. టీడీపీకి అమరావతి రైతులే తప్ప మిగతా రైతులు కనిపించడం లేదు. వరదల సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. డిసెంబర్ నెలాఖరుకల్లా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత మాది. సీఎం జగన్ స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వేలను గాలి సర్వేలని చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు చేసిన సర్వేలను ఏమనాలి. హుద్‌హుద్ తుపాను వస్తే అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు ఫోజులిచ్చారు. నటించడం మా ముఖ్యమంత్రికి రాదు.
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆ సీజన్‌లోనే పరిహారం ఇవ్వాలనేది సీఎం జగన్ ఆదేశం. ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నాం. ఈ క్రాప్‌లో నమోదు చేసుకుంటే చాలు ఉచిత పంటల బీమా వర్తింపు. రైతుల కోసం రాష్ట్రప్రభుత్వమే బీమా కంపెనీని ఏర్పాటు చేస్తుంది. కేంద్రం అనుమతి వచ్చిన వెంటనే బీమా కంపెనీని ఏర్పాటు చేస్తాం. రైతు భరోసా కింద ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.11,981 కోట్లు వేశాం. ఏడాదిన్నరలో నేరుగా రైతుల ఖాతాల్లో రూ.13,463 కోట్లు వేశాం. పొగాకు రైతులనుసైతం ఆదుకునేందుకు పొగాకును కొనుగోలు చేశాం. సుమారు రూ.120 కోట్లతో పొగాకును కొనుగోలు చేశాం.
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చేయూత పథకం కింద మహిళలకు పాడి పశువులు అందిస్తున్నాం. సహకార చక్కెర కర్మాగారాలను చంద్రబాబు అమ్మేశారు. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం మేం సబ్‌కమిటీలను వేశాం కరోనా సమయంలో ధరలు పడిపోయిన అరటి, బత్తాయి పంటలను కొన్నాం. ధర పడిపోయిన ప్రతిసారి ఉల్లిని కొనుగోలు చేశాం’ అని వివరించారు.
మంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే టీడీపీకే చెందిన పయ్యావుల కేశవ్.. రామానాయుడు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. మీ పార్టీకి చెందిన సభ్యుడిని మాట్లాడకుండా అడ్డుకోవడం సబబు కాదని కేశవ్‌కు స్పీకర్ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు.
ఇక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలో ఆవేశంతో ఊగిపోయారు. అధికార పక్షంవైపు వేలు చూపిస్తూ వాగ్యుద్దానికి దిగారు. టీడీపీ సభ్యులు అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నిమ్మల రామానాయుడికి మాట్లాడే అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా టీడీపీ సభ్యులు గలాటా సృష్టించడంపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. తన తప్పులను కప్పిపుచ్చకునేందుకు చంద్రబాబు సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు సరిపోకపోతే చంద్రబాబు, లోకేష్.. జూమ్ మీటింగ్ పెట్టుకోవాలని కొడాలి నాని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘మా భద్రత కన్నా ప్రజల భద్రతే మాకు ముఖ్యం. పేర్ని నాని ఎన్నడూ ప్రజల్లోనే, ప్రజల మనిషిగా తిరుగుతున్నార’ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.