YSR Kapu Nestham: వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులు విడుదల, అర్హులైన 3,38, 792 మందికి రూ. 508.18 కోట్ల ఆర్థికసాయం అందించిన సీఎం జగన్

అర్హులైన 3,38, 792 మందికి రూ. 508.18 కోట్ల ఆర్థికసాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సీఎం జగన్‌ బటన్ నొక్కి నగదు జమచేశారు.

CM YS Jagan disbursed Rs.508.20 crore under YSR Kapu Nestham scheme (Photo-Twitter)

Kakinada, July 29: వైఎస్సార్‌ కాపు నేస్త పథకం వరుసగా మూడో ఏడాది నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులైన 3,38, 792 మందికి రూ. 508.18 కోట్ల ఆర్థికసాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సీఎం జగన్‌ బటన్ నొక్కి నగదు జమచేశారు. మూడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ రూ. 45 వేలు ఇచ్చామని సీఎం తెలిపారు. ఇప్పటివరకూ వైఎస్సార్‌ కాపు నేస్తం కింద రూ.1,492 కోట్లు సాయం అందించామని సీఎం తెలిపారు.

నవరత్నాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి 16,256 కోట్ల లబ్ధి జరిగిందన్నారు. నాన్‌ డీబీటీ ద్వారా కాపు సామాజిక వర్గానికి మరో 16 వేల కోట్ల లబ్ధి జరిగిందని, మొత్తంగా కాపు సామాజిక వర్గానికి మూడేళ్లలో 32,296 కోట్ల మేలు జరిగిందని సీఎం తెలిపారు. కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ నేరుగా డబ్బు జమ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్‌ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

విద్యుత్‌ శాఖపై సీఎం జగన్ సమీక్ష, థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు

‘‘మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నా’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైఎస్సార్‌ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు.అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్నామని, క్రమం తప్పకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతీ పేదవాడికి అండగా ఉండడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

డీబీటీ అంటే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌. డీబీటీ ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో డీపీటీ సమర్థవంతంగా అమలు అయ్యిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ‘డీపీటీ’ అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో అని సీఎం జగన్‌ నిర్వచించారు. డీపీటీ ద్వారా దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీరికి తోడు దత్తపుత్రుడు అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని ఎద్దేవా చేశారు. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మడానికి దత్త పుత్రుడు ప్రయత్నిస్తున్నాడు.

మన ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం కావాలా? చంద్రబాబు హయాంలో ఉన్న దోచుకో, పంచుకో, తినుకో కావాలా?..అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారాయన. చంద్రబాబు, పవన్‌, ఎల్లోమీడియాకు తెలిసింది అవినీతి మాత్రమే. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. హుద్‌హుద్‌ వచ్చినప్పుడు 11 రోజుల పాటు నేనే స్వయంగా ఉత్తరాంధ్రలో తిరిగా. ఆ సమయంలో పాచిపోయిన పులిహోర ప్యాకెట్లను బాధితులకు పంచాడు ఆయన. కానీ, మా హయాంలో విపత్తు వస్తే బాధితులను సక్రమంగా ఆదుకుంటున్నాం.

వరద బాధితులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా రేషన్‌తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నాం. చంద్రబాబు తన పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారు. అలాగే.. జగనన్న పాలనలో లబ్ధి జరగలేదని చంద్రబాబు ఏ ఒక్కరినీ చూపలేకపోయారు. అబద్దాల మార్క్‌ చంద్రబాబు కావాలా? ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం కావాలా?.. ఎవరి పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సీఎం జగన్‌ పిలుపు ఇచ్చారు.