Andhra Pradesh: ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్, రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్న ఏపీ జెన్‌కో మూడో యూనిట్
మూడో యూనిట్‌ను (3rd unit of Genco thermal plant) జాతికి అంకితం చేశారు.
Nellore, Oct 27: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. మూడో యూనిట్‌ను (3rd unit of Genco thermal plant) జాతికి అంకితం చేశారు. ప్రభుత్వ రంగంలో దేశంలోనే మొదటిదైన ఈ సూపర్ క్రిటికల్ యూనిట్ రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది.సాధారణ థర్మల్ పవర్ ప్లాంట్లతో పోలిస్తే ఈ ప్లాంట్‌లో తక్కువ బొగ్గును వినియోగిస్తారు. దీనివల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం కొంత మేర తగ్గుతుంది. రోజుకు 9,312 టన్నుల బొగ్గుతో నడిచేలా ఈ యూనిట్‌ను రూపొందించారు.
కృష్ణపట్నం ప్లాంట్ మొత్తం సామర్థ్యం నాలుగు యూనిట్లు కాగా, స్టేజ్–1లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మూడవ యూనిట్‌గా స్టేజ్–2లోని 800 మెగావాట్ల ప్లాంట్‌ను రూ.5,082 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు. అయితే జీఎస్టీ అమలు, చట్టంలో మార్పు, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్ట్ వ్యయం కొంత పెరిగింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5,935.87 కోట్లు, రాష్ట్ర విద్యుత్ ఆర్థిక సంఘం ద్వారా రూ 1,000 కోట్ల రుణ సాయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.
ఈ ఏడాది ఆగస్టు నుంచి రెండవసారి ట్రయల్ రన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తాల్చేర్ నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు రవాణా జరుగుతుంది. బంగాళాఖాతం నుంచి సముద్రపు నీటిని గ్రహించి, ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీటిగా మార్చి వినియోగిస్తారు. కాగా, ఈ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 జూలై 17న శంకుస్థాపన చేయగా, ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ పూర్తి చేయడం విశేషం