Andhra Pradesh Elections 2024: టీడీపీ అధికారంలోకి వస్తే రూ. 4 వేలు పెన్సన్, కుప్పంలో చంద్రబాబు సంచలన ప్రకటన, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమని వెల్లడి

మూడు పార్టీల అజెండా ఒక్కటేనని... రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు (Chandrababu Naidu ) ఉద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు.

Chandrababu (Photo0TDP/X)

Kuppam, Mar 26: రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగు తమ్ముళ్లు ఎవరికీ భయపడబోరని, అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుకుంటూ వెళతామే తప్ప, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

ఏపీలో అరాచక పాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీల అజెండా ఒక్కటేనని... రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు (Chandrababu Naidu ) ఉద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు.

ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్ సభ స్థానాలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ (Rs 4,000 pension) ఇస్తామని, ఇంటివద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించామని తెలిపారు.

కుప్పం ప్రజలు ఈసారి తనకు లక్ష ఓట్ల మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. కుప్పం ప్రజలను తానెప్పుడూ ఇలా అడగలేదని అన్నారు. కానీ ప్రజలే తనకు భారీ మెజారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారా, నమ్మకమేనా? అని చంద్రబాబు కుప్పం ప్రజానీకాన్ని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం... అన్ని ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన నియోజకవర్గం కుప్పం, సైకిల్ కు తప్ప వేరే పార్టీకి ఓటేయని నియోజకవర్గం కుప్పం... ఇది బంగారు కుప్పం అని అభివర్ణించారు.  జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు రఘురామ కాదు, ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు, నరసాపురం సీటు నాకు రాకుండా అడ్డుకున్నారని మండిపాటు

"ఇలాంటి కుప్పంలో మీరు చరిత్ర సృష్టించాలని నిర్ణయించుకున్నారు. అందుకే అడుగుతున్నా. గతంలో 70 వేల మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి టార్గెట్... లక్ష ఓట్ల మెజారిటీ. ఇప్పటికే ఏడు సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గానికి ఎంతో రుణపడి ఉన్నాను. గత 35 ఏళ్లలో ఏం చేశానో, అంత అభివృద్ధి రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్తాను. మీది, నాది ఈనాటి బంధం కాదు. గత మూడున్నర దశాబ్దాలుగా నన్ను ఆదరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇల్లు నా ఇల్లు. ప్రతి గ్రామం నా గ్రామమే. ప్రతి కుటుంబం నా కుటుంబమే. ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా నా ఇబ్బందిగానే భావించి మీకు అండగా నిలుస్తాను.

Here's Videos

మొన్న చాలా మంది కుప్పిగంతలు వేశారు. కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తాం... వై నాట్ కుప్పం, వై నాట్ 175 అన్నారు. కుప్పంలో నన్ను ఓడించడం వీళ్ల వల్ల అవుతుందా? నేను అడుగుతున్నా... వై నాట్ పులివెందుల? జగన్... నీకెందుకు ఓటెయ్యాలి? బాబాయిపై గొడ్డలి వేటు వేసినందుకా? రాష్ట్రాన్ని దోచుకున్నందుకా? రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసినందుకా?

ఈ రోజు కుప్పం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రచారం ప్రజాగళానికి శ్రీకారం చుడుతున్నా. ఈ ప్రజాగళం ఉద్ధృతంగా మారి, తీవ్ర వాయుగుండంగా మారి... అడ్డొచ్చిన వాళ్లను బంగాళాఖాతంలో కలిపేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనుంది. సమయం ఉందని అశ్రద్ధ చేయొద్దు తమ్ముళ్లూ! సైకిల్ గాలి ఉద్ధృతంగా వీయాలి. ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టని అడిగినా... సైకిల్, దాని మిత్రపక్షాల మాటే వినపడాలి. ఫ్యాన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలంతే. చేసిన తప్పుడు పనులకు ఆ ఫ్యాన్ కనపడకూడదు.

కుప్పం ప్రజలు లక్ష మెజారిటీ ఇస్తామని మాటిచ్చారు... రాష్ట్రంలో టీడీపీ కూటమిని 175కి 175 స్థానాల్లో గెలిపిస్తామని రాష్ట్ర ప్రజలు సంకల్పం చేయాలి. ఐదేళ్లపాటు వైసీపీ పాలనలో అక్రమాలు, అరాచకాలు, బాదుడే బాదుడు... ఇలా అన్నీ చూశాం. సామాన్య పౌరుల కుటుంబాల నుంచి, అన్ని వర్గాల వారు నష్టపోయారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ప్రైవేటు ఆస్తులు, కంపెనీలు, పరిశ్రమలు, వాటాలు లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు, తాము అధికారంలోకి వచ్చాక ఇదే పోలీసులతో రౌడీలను నియంత్రిస్తాం. ఎన్నికలు సజావుగా జరగనివ్వాలని రౌడీలను హెచ్చరిస్తున్నాం.

ఇటీవల హంద్రీనీవా నీళ్ల పేరుతో జగన్ వచ్చి హంగామా చేశారు. కానీ కుప్పంకు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే, టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. నాడు హంద్రీనీవా ప్రాజెక్టును 90 శాతం నేనే పూర్తి చేశాను. వచ్చే సీజన్ లో కుప్పంకు నీళ్లు తెచ్చి అన్ని చెరువులు నింపుతాం. నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా మైనింగ్ చేస్తున్నారు. శాంతిపురంలో కేజీఎఫ్ మాదిరిగా తవ్వేశారు. వైసీపీ నేతలు యధేచ్ఛగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. పుంగనూరు వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తం కక్కిస్తా" అంటూ చంద్రబాబు హెచ్చరించారు.

రంజాన్ మాసం నేపథ్యంలో... కుప్పంలోని కేవీఆర్ కల్యాణమండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.రాష్ట్రంలో ముస్లింల భద్రతకు తాను బాధ్యత తీసుకుంటానని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరం అని, పొత్తు వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలను తాము ఏనాడూ తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘

‘రంజాన్ మాసం అంతా సూర్యాస్తమయం వరకూ నీళ్లు, ఆహారం తీసుకోకుండా కఠోరమైన దీక్షను ముస్లిం సోదరులు చేపడతారు. ముస్లింలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. 40 ఏళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉర్దూను రెండో భాషగా చేసింది టీడీపీనే. సమైక్య రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేశాను.

ముస్లింలో చాలా మంది పేదలు ఉన్నారని గుర్తించిన ఎన్టీఆర్ 1985లో దేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని... హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి విమాన సదుపాయాన్ని కల్పించాం. రాష్ట్రం విడిపోయాక కడప, విజయవాడలో హజ్ హౌస్ ల నిర్మాణం చేపట్టి 90 శాతం పూర్తి చేశాం. కానీ వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు.

సమైక్య రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్ కు తెచ్చాం... విభజన తర్వాత కర్నూలుకూ తెచ్చాం. ఖురాన్ స్ఫూర్తితో పేద ముస్లింలైన 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. దుకాన్ మకాన్, దుల్హన్ పథకాలను ప్రవేశపెట్టాం. 33 వేల మందికి దుల్హన్ పథకం ద్వారా రూ.165 కోట్లు ఆర్థిక సాయం ఇచ్చిన ఏకైక పార్టీ టీడీపీ. విదేశీ విద్య కింద 527 మందిని విద్యార్థులను విదేశాలకు పంపించాం.

కానీ ఈ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. ఒక్క మైనారిటీ సోదరుడికైనా ఆర్థిక సాయం అందించిందా? ఒక్క మసీదైనా కట్టారా? ఆఖరికి మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వలేదు. నాడు నేను రూ.3 లక్షల రుణం ఇచ్చి రూ.లక్ష సబ్సీడీ ఇచ్చా. ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనం ఇచ్చింది టీడీపీనే. కానీ 6 నెలలుగా ఈ ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వడం లేదు.

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మిగనూరులో హజీరాబీ అనే ముస్లిం యువతిని కొందరు వైసీపీ గూండాలు అత్యాచారం చేసి చంపేస్తే పట్టించుకోలేదు. వి.కోటలో చదువుల తల్లి మిస్బా బాగా చదువుతుంది... కానీ వైసీపీ నేత కూతురు సెకెండ్ వస్తోందని మిస్బాకు టీసీ ఇవ్వడంతో ప్రాణాలు వదిలిపెట్టింది. ముస్లిం ఆడబిడ్డ బాగా చదువుకుంటే మనసు ఒప్పలేని దుర్మార్గులు వీళ్లు.

కళ్యాణదుర్గంలో చాపిరి గ్రామంలో యువతిని మోసం చేసి చంపేశారు. దాచేపల్లిలో అలీషా మద్యం అమ్ముతున్నాడని నింద వేసి కొట్టి చంపేశారు. కడపలో అక్బర్ బాషాకు చెందిన భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్యకు యత్నించాడు. ముస్లిం యువకులపై పుంగనూరులో కేసులు పెట్టి 12 మందిని జైలుకు పంపారు. మసీదును కబ్జా చేస్తున్నారని పోరాడినందుకు నరసరావుపేటలో ఇబ్రహీంను నరికి చంపారు.

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? 45 ఏళ్ల ట్రాక్ రికార్డు ఉన్న పార్టీ టీడీపీ. ఎన్డీయేలో ఉన్నప్పుడు కూడా గతంలో ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలు ఏనాడూ చేయలేదు. మీ పిల్లల అభివృద్ధి కోసం కృషి చేశాం. పార్లమెంట్ లో అన్ని చట్టాలకు వైసీపీ ముందుండి మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం ఉంది. అందరిపై దాడులు చేస్తున్నారు.

అందుకే నేను, పవన్ ఆలోచించి బీజేపీ ముందుకు రావడంతో పొత్తు పెట్టుకున్నాం. ముస్లింలకూ పనులు కావాలన్నా... అభివృద్ధి చెందాలన్నా కేంద్ర ప్రభుత్వ సాయం కావాలి... అందుకే పొత్తు పెట్టుకున్నాం తప్ప మరో కారణం కాదు. 3 పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నాయి. నేను సీఎంగా ఉన్నంత కాలం మీకు అన్యాయం జరగదు. దుర్మార్గ ప్రభుత్వం వస్తే మీకూ భవిష్యత్తు ఉండదు. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది.

అందరినీ సమానంగా చూసి, అందరికీ సంక్షేమాన్ని అందించే ఏకైక పార్టీ టీడీపీ. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగలాన్నదే నా తపన. ముస్లింలకు ఏం కావాలన్నా నేను ముందుంటా. ముస్లిం సోదరులు ఏదీ మనుసులో పెట్టుకోకుండా ముందుకు రావాలి. ముస్లింల భద్రతకు నాది బాధ్యత’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.



సంబంధిత వార్తలు