Raghurama vs CM Jagan (Photo-File Image)

Vjy, Mar 25: టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఏపీలోని 6 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. రఘురామకృష్ణంరాజు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరును అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రకటించిన ఆరుగురు లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో (Andhra Pradesh Eelctions 2024) నరసాపురం సీటు నుంచి తన పేరు లేకపోవడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు (MP Raghuramakrishna Raju) స్పందించారు. నరసాపురం సీటు నుంచి తనకు అవకాశం దక్కకుండా సీఎం జగన్‌ అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు.

రఘురామకృష్ణరాజుకు బీజేపీ నుంచి టికెట్‌ రానివ్వరని ముందే కొందరు చెప్పారని ఆయన ప్రస్తావించారు. బీజేపీ తరపున సీటు దక్కకపోయినా సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, జగన్‌కు (CM Jagan Mohan Reddy) తగిన గుణపాఠం చెబుతానని మండిపడ్డారు. సీఎం జగన్‌ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మొదటి నుంచి దండెత్తిన తనకు అటు బీజేపీ, ఇతర పార్టీల నుంచి అవకాశం లేకుండా చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.  ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు విడుదల..ఎంపీ రఘరామ కృష్ణం రాజుకు మొండి చేయి..జనసేన 18 స్థానాల్లో MLA అభ్యర్థుల జాబితా విడుదల..పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..

జగన్‌ ప్రభావంతో నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని, కొందరు బీజేపీ నేతలతో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని, ఓ నేత ద్వారా టికెట్‌ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. నరసాపురం నుంచి పోటీచేస్తానా? ఇంకేదైనా స్థానమా? అనేదానికి కాలమే సమాధానం ఇస్తుందని అన్నారు. పనికిమాలిన వైసీపీలో చేరి ప్రజలకు అన్యాయం చేశాననే భావనతో ప్రాణాలకు తెగించి పోరాటం చేశానని పేర్కొన్నారు. తనకు సీటు దక్కకపోయినప్పటికీ జగన్‌ అనుకున్నది మాత్రం జరగనివ్వబోనని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్‌ చీప్‌ ట్రిక్స్‌ పనిచేయబోవని పేర్కొన్నారు. రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష అనుభవపూర్వకంగా తెలిసివచ్చిందని రఘురామరాజు వ్యాఖ్యానించారు. నరసాపురం టికెట్‌ రానందుకు తన అభిమానులు మనస్తాపం చెందవద్దని ఆయన సూచించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఎన్డీయే విజయం సాధిస్తుందని, చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు.

గత నాలుగేళ్లుగా జగన్‌ అవినీతి, అక్రమాలపై పోరాటం చేశానని, ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేస్తున్నానని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయిస్తానని, జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు రఘురామ కాదని శపథం చేశారు. తనకు టికెట్‌ దక్కకుండా జగన్ తాత్కాలికంగా విజయం సాధించారని, అపజయాన్ని అంగీకరిస్తున్నానని రఘురామ అన్నారు.

జగన్‌ కుట్ర చేస్తారని తెలిసినా.. ఏ మూలనో ఒక నమ్మకంతో తేలికగా తీసుకున్నానని పేర్కొన్నారు. ఎంపీగా తనను అనర్హుడిని చేయాలని జగన్ ప్రయత్నించారని, జైల్లో తనను చంపేందుకు ప్రయత్నించారని రఘురామకృష్ణ రాజు ఆరోపణలు చేశారు. జగన్ తన మతానికి చెందిన అధికారిని అడ్డం పెట్టుకొని తనను అక్రమంగా అరెస్టు చేశారని, చంపాలని చూశారని అయితే ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అన్నారు. ఈ పరిణామాలపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని, సందేశాలు పంపించారని నరసాపురం ఎంపీ తెలిపారు. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంలో ఉన్నానని చెప్పడం లేదని పేర్కొన్నారు.