Andhra Pradesh Elections 2024: రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా? కొల్లూరులో ప్రజాగళం సభలో సీఎం జగన్ మీద విరుచుకుపడిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటు వేసే వారిని కాటు వేసే రకం అతను అని విమర్శించారు.
Bapatla, April 12: టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటు వేసే వారిని కాటు వేసే రకం అతను అని విమర్శించారు. ఐదేళ్ల పాటు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా బయటికి వచ్చాడా? ఎవరినైనా కలిశారా? అని ప్రశ్నించారు. పేద ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీలో రౌడీలు ఉన్నారు, మంచివాళ్లు ఉన్నారని.... రౌడీలు తమకు అక్కర్లేదని, మంచివాళ్లు టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ ముఖ్యమంత్రి మీటింగులకు వస్తున్నాడంటే రోడ్లన్నీ తవ్వాలి, చెట్లన్నీ నరకాలి అని ఎద్దేవా చేశారు. సభకు రాకపోతే పింఛను కట్, రేషన్ కట్, అమ్మ ఒడి లేదు అని అన్నారు. కొందరు మాత్రం నువ్వేమీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు... మళ్లీ బాబు వస్తాడు... అన్నీ ఇస్తాడు అని ఇటువైపుకు వచ్చేస్తున్నారు అని చంద్రబాబు వివరించారు. చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం, ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..
"మొన్న, నిన్న నేను, పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తే గోదావరి గర్జించింది, మేం ఉన్నాం మీకు అండగా అని జనం పోటెత్తారు. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి సభలు చూడలేదు, ఆడబిడ్డలు నీరాజనాలు పలికారు. ఈ ప్రాంతాన్ని గతంలో తుపానులు దెబ్బతీశాయి. కానీ తుపానుల కంటే ఈ అసమర్థ ముఖ్యమంత్రి నిర్వాకాలే ఎక్కువ దెబ్బతీశాయి.
ఇవాళ పంట బీమాను కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. కనీసం ధాన్యం కొనే పరిస్థితులు ఉన్నాయా? తుపాను వస్తే కనీసం ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాడా? కానీ నేను వచ్చాను. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి ఐదు సార్లయినా రైతులతో మాట్లాడాడా? ఏ పొలానికైనా వెళ్లాడా? ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కార్చుతున్నాడు. మొన్న వచ్చాడు... రెడ్ కార్పెట్ వేసి స్టేజ్ కట్టి తుపాను బాధితులను, వరదను చూస్తున్నాడు. వాలంటీర్ల పేర్లు వింటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి, పల్నాడు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
ఒకప్పుడు ఓట్ల కోసం నెత్తిన చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు... ఆ తర్వాత పిడిగుద్దులే గుద్దులు. నిన్నటిదాకా పరదాల చాటున తిరిగాడు... ఇప్పుడు పరదాలు వదలిపెట్టి మళ్లీ నాటకాలు, మోసాలతో వస్తున్నాడు. నాడు నేను పట్టిసీమను కట్టాను. కానీ ఈ అహంకారి ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టి, పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకువెళ్లాడు.
పోలవరం పూర్తి చేసి, నదులు అనుసంధానం చేస్తే గుంటూరు జిల్లాలో రెండు పంటలు కాదు, మూడు పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉండేది. పోలవరం ప్రాజెక్టును మేం 72 శాతం పూర్తి చేశాం. కానీ ఒక ఉన్మాద ముఖ్యమంత్రి ఏం తెలియకపోయినా, తెలిసినట్టు నటించి పోలవరాన్ని ముంచేశాడు.
అమరావతి మన రాజధాని. ఒకప్పుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేశాను. ఆ నమ్మకంతో అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నాను. నేను ఇచ్చిన పిలుపుతో, నా మీద నమ్మకంతో 35 వేల ఎకరాల భూమిని 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు... ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు... అదీ మన విశ్వసనీయత. కానీ ఈ దుర్మార్గుడు మొదట అమరావతి రాజధాని అంగీకరిస్తానన్నాడు... ఆ తర్వాత మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడాడు. రాష్ట్రాన్ని తల లేని మొండెంలా చేసిన అలాంటి వాళ్లకు ఓట్లు వేస్తారా?
అమరావతి రాజధాని వచ్చుంటే... మన పిల్లలు హైదరాబాద్, చెన్నై వెళ్లనవసరం లేకుండా ఇక్కడే బ్రహ్మాండమైన యూనివర్సిటీలు వచ్చుండేవి. ఉదయం వెళ్లి చదువుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్లు. మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది... ఎవరైనా పనులు చేసుకోవాలనుకున్నా ఇక్కడే చేసుకునే వీలుండేది. పాచిపనులు చేసుకోవాలనా, ఆటోలు నడుపుకోవాలన్నా మనం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. అందుకే ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలో మే 13న మీరే నిర్ణయించాలి. ఈ ముఖ్యమంత్రిది ఒక విచిత్రమైన వ్యక్తిత్వం... నా ఎస్సీలు అంటాడు... భస్మాసురుడి మాదిరిగా వాళ్ల నెత్తిమీదే చేయి పెడతాడు. పాము తాను పెట్టిన గుడ్లను తానే మింగేస్తుంది. ఈయన కూడా అంతే... ఎవరైతే ఓటు వేస్తారో వారినే కాటేస్తాడు.
ఈ ప్రభుత్వంలో ఎక్కువమంది బలైంది షెడ్యూల్డ్ కులాల వారు. నా ఎస్సీలు అంటూ సబ్ ప్లాన్ లేకుండా చేసిన దుర్మార్గుడు ఇతను. మాస్కు పెట్టుకోలేదని విక్రమ్ అనే దళితుడ్ని కొట్టి చంపేశారు. డ్రైవర్ ను చంపిన ఎమ్మెల్సీని పక్కనబెట్టుకుని తిరుగుతున్నాడు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిలా చేసి అతడి చావుకు కారణమయ్యారు!
దళితుల కోసం మేం 27 పథకాలు తీసుకువస్తే అవన్నీ రద్దు చేశాడు. దళితులకు ఇన్నోవాలు ఇచ్చాను, అంబేద్కర్ విదేశీ విద్య తెచ్చాను... అంబేద్కర్ పేరు తీసేసి జగన్ తన పేరు పెట్టుకుని అంబేద్కర్ ను అవమానించాడు. దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు ఇప్పుడు లేవు. దళిత ద్రోహి ఈ ముఖ్యమంత్రి. దళితులు ఈ ముఖ్యమంత్రికి ఓటేస్తారా అని అడుగుతున్నా? మీకు విధ్వంసక పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా, లేక సంక్షోభ పాలన కావాలా? మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, లేక గంజాయి కావాలా? డ్రగ్స్ కావాలో మీరే ఆలోచించుకోవాలి" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)