Andhra Pradesh Elections 2024: తుప్పు పట్టిన సైకిల్ కథ చెప్పిన సీఎం జగన్, చంద్రబాబుపై కోరుకొండలో మరోసారి విరుచుకుపడిన ఏపీ ముఖ్యమంత్రి

ఎన్నికల ముందు రకరకాల వాగ్ధానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడంతో 2019లో రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె, పట్టణ ప్రజలు అంతా కలిసి సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారని విమర్శించారు.

YS jagan memantha-siddham-(photo-X/YSRCP)

Korukonda, May 7: రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ టీడీపీ కూటమిపై విరుచుకుపడ్డారు. 14 ఏండ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ పేదకైనా మంచి చేశారా? అని ఏపీ సీఎం జగన్‌ ప్రశ్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తొస్తుందా అని అడిగారు.

ఎన్నికల ముందు రకరకాల వాగ్ధానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడంతో 2019లో రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె, పట్టణ ప్రజలు అంతా కలిసి సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారని విమర్శించారు.  నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కి వెయ్యము, వీడియో ఇదిగో, జనసేనాధినేతకు షాకిస్తున్న SVSN Verma అనుచరులు

మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ- చంద్రబాబునాయడు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.

2019 ఎన్నికల తర్వాత తుప్పుబట్టిన సైకిల్‌కు రిపేర్‌ చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని జగన్‌ విమర్శించారు. ఆ రిపేర్‌ చేయించడంలో భాగంగా ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్లాడని తెలిపారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్లినప్పుడు అక్కడ ఫలితం రాలేదని.. దీంతో దత్తపుత్రుడిని పిలుచుకున్నాడని అన్నారు. ఆ దత్తపుత్రుడేమో సైకిల్‌ మొత్తాన్ని చూసి.. నేను క్యారేజి మీద మాత్రమే ఎక్కుతాను.. టీ గ్లాస్‌ మాత్రమే పట్టుకుని తాగుతానని అన్నాడని విమర్శించారు. మిగతావి తన వల్ల కాదని దత్తపుత్రుడు చెప్పాడని అన్నారు.  మా తమ్ముడిని పిఠాపురంలో గెలిపించండి, వీడియో విడుదల చేసిన చిరంజీవి, జనసేనాని గురించి ఇంకా ఏమన్నారంటే..

ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడని.. అక్కడి మెకానిక్‌లను ఇక్కడికి దింపాడని అన్నారు. ‘ సైకిల్‌ను ఒక షేప్‌లోకి తీసుకురమ్మని ఆ మెకానిక్‌లను బాబు అడిగాడు. ఆ మెకానిక్‌లు వచ్చి తుప్పుబట్టిన సైకిల్‌ను చూశారు.. ఆ సైకిల్‌కు హ్యాండిల్‌ లేదు.. సీటు లేదు.. పెడల్స్‌ లేవు.. చక్రాలు లేవు.. ట్యూబ్‌లు లేవు.. మధ్యలో ఫ్రేమ్‌ కూడా లేవు.. ఇంత తుప్పబట్టిన సైకిల్‌ను ఎలా బాగు చేస్తామని చంద్రబాబును అడిగారు. అప్పుడు పిచ్చి చూపులు చూసి.. ఇదొక్కటే మిగిలిందని బెల్‌ను చూపించి.. బెల్‌ కొట్టడం మొదలుపెట్టాడు.’ అని విమర్శించారు. ఆ బెల్‌ పేరే.. అబద్ధాల మేనిఫెస్టో అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు చేస్తూనే ఉంటారని విమర్శించారు.

అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో.. 2014 మేనిఫెస్టో చూస్తే తెలుస్తుందని జగన్‌ అన్నారు. ఇదే ముగ్గురితో అప్పుడు కూటమిగా ఏర్పడి.. ఒక మేనిఫెస్టోను ఇంటింటికీ పంపించాడని గుర్తు చేశారు. ఆ మేనిఫెస్టోతో గెలిచిన తర్వాత.. అందులో చెప్పిన ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు.  ఏపీలో వ‌రుస బ‌దిలీల‌పై తొలిసారి స్పందించిన సీఎం వైఎస్ జ‌గ‌న్, ఎన్నిక‌లు స‌జావుగా సాగుతాయో లేదో అని అనుమానం

ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అందించాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.

మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి.

మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా?. ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఎవరైనా చేశారా? అని మీరే ఆలోచించండి అని సీఎం జగన్ కోరారు.

నాడు నేడు బాగుపడ్డ గవర్నమెంట్‌ బడులు. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్స్‌, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?..

నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?

నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటికే అందించడం ఎప్పుడైనా జరిగిందా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.

స్వయం ఉపాధికి అండగా.. తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?

పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.

గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.

ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల భద్రతకు తోడుగా ఫోన్‌లోనే దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడని అన్నారు.

ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్‌ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా?. జగన్‌ ఏదైనా బటన్‌లు నొక్కాడో.. ఆ బటన్‌లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారింది. ఈ బటన్‌లు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కింది రాదు. ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా నొక్కుతూ వస్తున్న పథకాలకు సంబంధించినవే. అసెంబ్లీలో ఆమోదం తెలిపినవే ఇవి. క్యాలెండర్‌ ప్రకారం ఇస్తూ వస్తున్నవే. జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పమని కోరుతున్నా. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్‌ 4వ తేదీ తర్వాత.. ఒక వారంలోనే ఆ బటన్‌లు అన్నీ క్లియర్‌ చేస్తాడని హమీ ఇచ్చారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement