Andhra Pradesh Fire: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఘోర అగ్నిప్రమాదం, 40కిపైగా బోట్లు దగ్ధం, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్, బాధితులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు
వార్త సంస్థ ANI ప్రకారంగా.. మొదటగా ఒక పడవతో మంటలు ప్రారంభమయ్యి.. చివరకి 40 పడవల దాకా వ్యాపించాయి.
ఈ మధ్యకాలంలో అనేక చోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వార్త సంస్థ ANI ప్రకారంగా.. మొదటగా ఒక పడవతో మంటలు ప్రారంభమయ్యి.. చివరకి 40 పడవల దాకా వ్యాపించాయి. సంఘటన జరిగిన వెంటేనే స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
వీటి విలువ రూ.40-50లక్షలు ఉంటుందని పేర్కొంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఇలా చేసి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉన్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో బాధిత కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..
Here's Video
విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.