Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, ఇకపై రాత పరీక్ష ద్వారానే ఉద్యోగాల భర్తీ, ఇంటర్వ్యూ విధానం రద్దు, ఏపీపీఎస్సీపై సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్

దీంతో ఈ పరీక్షకు హాజరైన సుమారు 60,000 మంది అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు...

Andhra CM YS Jagan | File Photo

Amaravathi, October 17: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) ద్వారా చేపట్టే ఉద్యోగాల నియామకాల అంశంలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం రాత పరీక్షలలో వచ్చే మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం సూచించింది. 2020 జనవరి నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)  ఏపీపీఎస్సీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగాల భర్తీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020 నుంచి ఇకపై ప్రతీ ఏడాది జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ఏపీపీఎస్సీ అధికారులను సీఎం ఆదేశించారు. పోస్టుల భర్తీలో అత్యవసర విభాగాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన సీఎం, నిర్వహించే ప్రతీ పరీక్షలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం చేయాలని అధికారులకు తెలియజేశారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు రానున్న జనవరిలో కొత్త నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసే ఏర్పాట్లు చేయనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు వెల్లడించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఉద్యోగ నియామకాల కోసం ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో, మంచి మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది మేలో గ్రూప్-1  (Group -1 Posts) పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో ఈ పరీక్షకు హాజరైన సుమారు 60,000 మంది అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. పరీక్ష రాసి 5 నెలలు పూర్తైనా, ఫలితాలు వెల్లడించకపోవడం పట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 23 వరకు జరుగుతాయని ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించింది. దీంతో సమయం తక్కువ ఉన్నందున వెంటనే ఫలితాలు ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు.