AP Govt Agreement with EDX: మన పోటీ దేశంతో కాదు ప్రపంచంతో.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందించే ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో జగన్ సర్కారు ఒప్పందం (AP Govt Agreement with EDX) చేసుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది.

CM Jagan with Students (photo/AP CMO)

Vjy, Feb 16: ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో జగన్ సర్కారు ఒప్పందం (AP Govt Agreement with EDX) చేసుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది.

ఇప్పటికే ఎడె­క్స్ (e-learning platform EDX), ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లె­ర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ స్కూ­ల్‌ ఆఫ్‌ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ఈ కోర్సు ప్రోత్సహిస్తోంది.

విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ఎడెక్స్‌తో ఒప్పందం

ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు.ఒప్పందం అనంతరం సీఎం మాట్లాడుతూ..‘‘ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం.నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని అన్నారు. ఈ దేశంలో ఉన్నవారితో కాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. మంచి మంచి జీతాలు సంపాదించాలి. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అని సీఎం జగన్ తెలిపారు.

మనం వేసిన ప్రతి అడుగులో ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రాధమిక విద్య స్ధాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. మానవవనరులమీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మన ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నాం. ప్రాధమికస్ధాయి నుంచి విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే... అక్కడ నుంచే అడుగులు పడుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. గ్లోబల్‌ సిటిజెన్స్‌ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలి. ప్రపంచస్ధాయితో పోటీపడాలి. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదని తెలిపారు.

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం చేయడం నుంచి మొదలు, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చడం, పిల్లలను బడులకు తీసుకువచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి కోసం అమ్మఒడి, గోరుముద్దతో మొదలు పెట్టాం. ఇంగ్లిషు మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా రానున్న పది సంవత్సరాలకు.. ఇవాళ ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు పదోతరగతికి వచ్చేసరికి ఐబీ (ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌) విద్యావిధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

Here's AP CMO Tweets

ఐబీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం. 2035 నాటికి ఏకంగా మన పిల్లలు ఐబీలో పరీక్షలు రాసే స్ధాయికి మన పిల్లల చదువులను తీసుకునిపోతారని తెలిపారు.6వతరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్‌ చేస్తూ... ఐఎఫ్‌బీలను ప్రతి క్లాస్‌రూంలలో ఏర్పాటు చేస్తున్నాం. 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి, పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ సులభంగా అర్ధం అయ్యేలా చేస్తున్నాం. బైజూస్‌ కంటెంట్‌ను అనుసంధానం చేశాం. బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగులో ప్రతి ప్రభుత్వ స్కూళ్లో అందుబాటులోకి తెచ్చామన్నారు.

తొలిసారిగా 400 పైగా బైలింగువల్‌ పాడ్‌క్యాస్టులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీ చేసే ప్రయత్నం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్ధలు మాత్రమే న్యాక్‌ గుర్తింపు పొందగా.. ఈ రోజు రాష్ట్రంలో న్యాక్‌ గుర్తింపు పొందిన విద్యాసంస్ధలు 437 ఉన్నాయి. ప్రతి అడుగులో విద్యలో నాణ్యత పెంచాలి.. అలా పెంచగలిగితే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడతారని ప్రతి అడుగు వేశామన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ, అగ్‌మెంటెడ్‌ టెక్నాలజీ, 3డి లెర్నింగ్‌ వంటి వాటిని మన కరిక్యులమ్‌లో అందుబాటులోకి తీసుకునిరావాలి. అలా తేగలిగితేనే నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేగలుగుతామని సీఎం తెలిపారు.

మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య వారికి అందించగలిగితేనే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్ద, పెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 400 మందికి పైగా ఇప్పటికే వినియోగించుకున్నారని సీఎం తెలిపారు.