IPL Auction 2025 Live

AP Panchayat Elections Row: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రకటన, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

జనవరి 8న ఎస్‌ఇసి పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుండి పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి....

File image of High Court of Andhra Pradesh | File Photo

Amaravati, January 21: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకుముందు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని, ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా ఎన్నికలు జరగాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది అలాగే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని పేర్కొంది.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ నెల 8వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఏపి ప్రభుత్వం జనవరి 9న హైకోర్టును ఆశ్రయించగా, 11వ తేదీన ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేశారు. ఈ ఎన్నికల షెడ్యూల్‌ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని స్పష్టంచేశారు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుపై రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎకె గోస్వామి, జస్టిస్ సి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం వాదనలు తమ వాదనలు వినిపించాయి. మంగళవారం విచారణను ముగించిన హైకోర్ట్ తీర్పును రిజర్వులో ఉంచి, గురువారం ప్రకటించింది. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్ట్ తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల సంఘం స్పందిస్తూ, షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. జనవరి 8న ఎస్‌ఇసి పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుండి పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో నిర్వహించేలా ఈ నెల 23 నుండి నోటిఫికేషన్లను విడుదల చేయాలని నిర్ణయించింది.

ఇదిలా ఉంటే, ఏపి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడం లేదు, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని తమ పిటిషన్ లో పేర్కొంది.