Three Capitals Row: 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదు, అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ పాలనా రాజధాని అయితే నష్టమేముందని ఆయన అన్నారు. యాత్రలను అడ్డుకోవడం తమకు ఐదు నిమిషాల పని అని చెప్పారు.

Minister Botsa Satyanarayana (Photo-Video Grab)

Amaravati, Sep 25: అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ పాలనా రాజధాని అయితే నష్టమేముందని ఆయన అన్నారు. యాత్రలను అడ్డుకోవడం తమకు ఐదు నిమిషాల పని అని చెప్పారు. తాము కన్నెర్ర చేస్తే పాదయాత్రలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. అయితే, యాత్రలను అడ్డుకోవడం పద్ధతి కాదని చెప్పారు.

మూడు రాజధానులు (Three Capitals Row) తమ విధానమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని అన్నారు. ఒక ప్రాంతం గురించో, కొందరు వ్యక్తుల గురించో ఆలోచించకూడదని చెప్పారు. మూడు రాజధానులకు అనుగుణంగా అన్ని సంఘాలు ర్యాలీలు చేయాలని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్రను తరిమికొట్టాలని కొందరు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయవద్దని అన్నారు.

ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌న్ అన్న ముందు కాదు, బాలయ్యపై ఏపీ మంత్రి రోజా ట్వీట్..

గతంలో ఉత్తరాంధ్రలో అంబలి తాగి బతికేవారని... ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత అన్నం తినడం ప్రారంభమయిందని చెప్పారు. తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని ఆయన వివరించారు.

శ్రీబాగ్‌ ఒప్పందం మేరకే కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నాం. టాప్‌-5 సిటీస్‌లో విశాఖ ఉంది. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.3 రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్‌ స్పష్టంగా చెప్పారు. అమరావతికి మా ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి’ అని తెలిపారు.