Corona in AP: సెకండ్ వేవ్, కొత్త రకం కరోనావైరస్ పట్ల అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 379 మందికి పాజిటివ్
అయితే సెకండ్ వేవ్ ఉండే అవకాశం ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నూతన సంవత్సర వేడుకలు, ఇతర విందులు వినోదాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు....
Amaravati, December 23: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ప్రతిరోజు సాధారణ స్థాయిలోనే కేసులు వస్తుండటం, కోలుకునే వారి సంఖ్య మెరుగ్గా ఉండటంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే సెకండ్ వేవ్ ఉండే అవకాశం ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నూతన సంవత్సర వేడుకలు, ఇతర విందులు వినోదాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
మరోవైపు దేశంలో కొత్త రకం కరోనావైరస్ ప్రవేశించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో ఏపీ కూడా ఆ దిశగా అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టింది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పసరిగా ఏపీ ఆరోగ్యశాఖ వెబ్ పోర్టల్ లో తమ వివరాలు నమోదుచేసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలోకి అనుమతి నిషేధం అని ఆరోగ్యశాఖ కమీషనర్ స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 57,716 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 379 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,79,718కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,76,823గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 84, చిత్తూరు నుంచి 64, గుంటూరు నుంచి 46 చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 3 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7085కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 490 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,68,769 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 3,864 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.