Udayagiri Politics: మేకపాటి కుటుంబానికే ఉదయగిరి టికెట్, రాజగోపాల్ రెడ్డిని వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన అధిష్ఠానం, చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టేలా వ్యూహం
ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2014లోనూ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. అయితే ఈ మధ్య జిల్లాలో తిరుగుబాటు పరిణామాలు జగన్ ని కలవరపెడుతున్నాయి. అసమ్మతితో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.
Nellore, June 28: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా పెట్టని కోట. ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2014లోనూ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. అయితే ఈ మధ్య జిల్లాలో తిరుగుబాటు పరిణామాలు జగన్ ని కలవరపెడుతున్నాయి. అసమ్మతితో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు. వీరిలో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు.ఆయన టీడీపీలోకి వెళతారనే వార్తలు వస్తున్నాయి. దీనికి బలాన్నిస్తూ యువగళం పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌నూ కలిశారు.
ఈ నేపథ్యంలో జగన్ ఆయనకు చెక్ పెట్టేలా, ఉదయగిరి సీటును మేకపాటి కుటుంబానికే అప్పజెప్పారు. ఉదయగిరి నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జ్ గా మేకపాటి కుటుంబం నుంచి రాజగోపాల్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో 2024 ఎన్నికల్లో మరోసారి మేకపాటి కుటుంబానికి రెండు సీట్లు ఖాయం చేసినట్టు తేలిపోయింది.
ఇక రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా.. త్వరలోనే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తా.. ఉదయగిరి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలకు అండగా ఉంటానని వెల్లడించారు.ఇదిలా ఉంటే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుమార్తె ఆదాల ప్రభాకర్ రెడ్డి కోడలు ఆదాల రచనారెడ్డిని బరిలో నిలపాలని వైసీపీ అధిష్టానం ఆలోచించింది.
అయితే రాజకీయాలపై ఆమె అనాసక్తి కనబరచడంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చిన్న తమ్ముడు, ప్రముఖ కాంట్రాక్టర్ మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై వైసీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇటీవల ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తన బాబాయ్ రాజగోపాల్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్లారు. సీఎంతో చర్చించిన అనంతరం రాజగోపాల్‌రెడ్డిని ఉదయగిరి వైసీపీకి నూతన సారథిగా నియమించడం గమనార్హం.
ఆయన మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండో సోదరు డు. విద్యాపరంగా డిగ్రీ పూర్తి చేశారు. నలభై ఏళ్లుగా కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌లో కాంట్రాక్టర్‌గా ఉంటూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కుమారులిద్దరికీ కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించారు. 1983లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసిన నాటి నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కీలకపాత్ర పోషించారు.
మేకపాటి కుటుంబానికి మరోసారి సముచిత ప్రాధాన్యత కల్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019లో మేకపాటి కుటుంబం తరపున నెల్లూరు జిల్లానుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టారు, ఆయన మరణం తర్వాత ఆ సీటు మేకపాటి విక్రమ్ రెడ్డికి దక్కింది, కానీ మంత్రి పదవి మాత్రం రాలేదు. ఇక ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు కానీ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ తో ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.
చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఉదయగిరికి చాలామంది ఇన్ చార్జ్ పోస్ట్ కోసం ట్రై చేశారు. వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరు దాదాపుగా ఖాయమైందని అనుకున్నారు. ఆ తర్వాత మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, చిరంజీవి రెడ్డి పేర్లు వినిపించినా ఎవరినీ ఖాయం చేయకుండా చాన్నాళ్లుగా నెట్టుకొచ్చారు జగన్. చంద్రశేఖర్ రెడ్డితోపాటు పార్టీనుంచి సస్పెండ్ అయిన మిగతా ఎమ్మెల్యేల స్థానాల్లో వెంట వెంటనే ఇన్ చార్జ్ లు పుట్టుకొచ్చారు కానీ, ఉదయగిరి మాత్రం అప్పటినుంచి ఖాళీగా ఉంది. ఇప్పుడది తిరిగి మేకపాటి కుటుంబం అకౌంట్లోనే పడింది.
ఉదయగిరికి ఇన్ చార్జ్ గా వేరే నాయకుడిని ప్రకటిస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో గతంలో రాజమోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి భ్రష్టుపట్టి పోయారని, అందుకే జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారని, కనీసం ఎమ్మెల్సీ తీసుకుని అయినా సర్దుకుపోయి ఉండాల్సిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటువేసి శేఖర్ రెడ్డి పెద్ద తప్పు చేశారని గతంలో తీవ్ర విమర్శలు చేశారు రాజమోహన్ రెడ్డి.
అప్పట్లో ఆయన ఉదయగిరి సీటు విషయంలో కూడా కీలక కామెంట్లు చేశారు. ఉదయగిరి సీటుకి వైసీపీ తరపున తాను రచనా రెడ్డి పేరు రికమెండ్ చేస్తానన్నారు. రచనా రెడ్డి కాకపోతే తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి అలియాస్ రాజారెడ్డికి ఆ సీటు ఇవ్వాలన్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి అలియాస్ రాజారెడ్డిని ఉదయగిరి ఇన్ చార్జ్ గా ప్రకటించారు జగన్.2024లో ఆ స్థానంలో రాజారెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని తేలిపోయింది.
ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆ పార్టీకే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో వారిద్దరిపైనా వేటు వేసింది వైసీపీ అగ్రనాయకత్వం.
వెంకటగిరి, నెల్లూరు రూరల్ స్థానాలకు కొత్తగా కోఆర్డినేటర్లను గతంలోనే అపాయింట్ చేసింది. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి అప్పగించింది. లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి.. నెల్లూరు రూరల్ స్థానం ఇన్‌ఛార్జీగా నియమిస్తూ ఇదివరకే ఉత్తర్వులను జారీ చేసింది.