Vallabhaneni Vamsi: 2024లో గన్నవరం నుంచే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా, సంచలన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారని విమర్శలు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైయస్సార్ పేరు మార్చడంపై ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్ ను తాను కోరానని చెప్పారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులని అన్నారు.
Amaravati, Oct 17: ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి వారే 2024 ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే (Gannavaram MLA Vallabhaneni Vamsi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైయస్సార్ పేరు మార్చడంపై ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్ ను తాను కోరానని చెప్పారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులని అన్నారు.
విజయవాడ ఎంపీగా తాను బరిలోకి దిగబోతున్నానంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారమని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ఎలాంటి మాట మాట్లాడలేదని అన్నారు. 2024లో (2024 election) తాను గన్నవరం నుంచే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అమరావతిని జగన్ కానీ, మరెవరు కూడా వ్యతిరేకించడం లేదని... అయితే అమరావతిని అభివృద్ధి చేసేందుకు కావల్సినన్ని నిధులు లేవని మాత్రమే చెపుతున్నారని చెప్పారు.
2009లో జూనియర్ ఎన్టీఆర్ పాతికేళ్ల వయసులో టీడీపీ కోసం ప్రచారం చేశారని... ఆ సమయంలో ఆయనకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందని... భగవంతుని దయవల్ల ఆయన కోలుకున్నారని వంశీ తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని... చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఎన్టీఆర్ వచ్చారని... తారక్ ను కనీసం స్టేజ్ పైకి కూడా ఆహ్వానించలేదని విమర్శించారు.
అమరావతితో ఎన్టీఆర్ కు సంబంధం లేదని... అమరావతి రైతులకు మద్దతుగా రావడం లేదని ఆయనను విమర్శించడం సరికాదని... ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటున్నారని వంశీ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ ను కరివేపాకుగా వాడుకుని వదిలేశారని... 2014 ప్రమాణస్వీకారం సమయంలో పట్టించుకోలేదని, కనీసం తారక్ కు ఒక బ్యానర్ కూడా కట్టలేదని అన్నారు. జనాల మధ్యలో కూర్చోబెట్టారని విమర్శించారు. ఇప్పుడు అవసరం వచ్చిందని రమ్మంటే ఆయన ఎలా వస్తారని ప్రశ్నించారు.