Visakha Woman Death Case: విశాఖ బీచ్‌లో గర్భిణి మహిళ మృతి కేసులో పురోగతి, అత్తమామల వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని నిర్థారించిన పోలీసులు

మృతురాలిని పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్‌మెంట్‌ను త్రీటౌన్‌ పోలీసులు నమోదు చేశారు.

Representative image. (Photo Credits: Unsplash)

Visakhapatnam, April 27: విశాఖ వైఎంసీఏ బీచ్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. మృతురాలిని పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్‌మెంట్‌ను త్రీటౌన్‌ పోలీసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు విచారణలో తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహిత శ్వేత మంగళవారం మిస్‌ అయినట్టు న్యూపోర్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో శ్వేత కోసం పోలీసులు గాలిస్తుండగా బుధవారం ఉదయం విశాఖ ట్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మృతదేహాం లభ్యమైంది. అయితే, నిన్న అర్ధరాత్రి సముద్రపు అలల తాకిడి మృతదేహాం కొట్టుకువచ్చినట్టు గుర్తించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం, ముగ్గురు చిన్నారులను బావిలో పడేసిన తల్లి, తను కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య

తాజాగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మృతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని ఆమె భర్త వేధించడం ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.నెల రోజులు క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించాడని పేర్కొన్నారు.

తన కూతురు అయిదు నెలల గర్భిణీ అని.. కడుపుతో ఉన్నా కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేవారని, అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్లో భర్త కూడా ఆదేశాలిచ్చేవాడని పేర్కొన్నారు.నేను భర్తను పొగొట్టుకున్నాను. కూతుర్ని ఒక్కదాన్నే కష్టపడి పెంచి పెద్ద చేశాను.

అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని రోజూ ఫోన్‌ చేసి ఏడ్చేది. పెళ్లికి ముందు సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని చెప్పింది. పెళ్లైన తరవాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. శ్వేత అత్తింటి వేధింపులు, భర్త టార్చర్ వల్లే ప్రాణం తీసుకుంది. నా ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ వాపోయారు.

యువతికి పెళ్లైనా ఆగని వేధింపులు, అందరూ చూస్తుండగానే యువకుడిని దారుణంగా నరికి చంపిన యువతి కుటుంబ సభ్యులు, మంచిర్యాలలో షాకింగ్ ఘటన

వరకట్నం వేధింపులే తన కుమార్తెకు మరణానికి కారణామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం తీసుకురావాలని కొద్ది నెలలుగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్వేత భర్త మణికంఠ, అత్త, మామ, ఆడపడుచు భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో కేసును విచారిస్తున్నట్లు తెలిపారు.

సూసైడ్‌ నోట్‌ రాసిన శ్వేత

ఇదిలా ఉండగా శ్వేత చనిపోయేముందు ఓ సూసైడ్‌ నోట్‌ రాసింది. ఇందులో ‘చిట్టీ...నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శ్వేత భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. విశాఖపట్నంలో అత్తమామల వద్ద శ్వేత ఉంటోంది. మంగళవారం అత్తతో గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఫోన్‌లో భర్తతోనూ గొడవపడింది. తర్వాత విగత జీవిగా బీచ్‌లో కనిపించింది.

మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్‌ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు.

మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాత్రి పెట్రోలింగ్‌ చేసే పోలీసుల గ్రూపులో ఆమె ఫొటో పోస్ట్‌ చేసి అదృశ్యమైందని వివరాలు పెట్టారు.

అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్‌.కె.బీచ్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇసుకలో కూరుకుపోయిన ఆమె మృతదేహాన్ని చూసి.. ఎవరో హత్య చేసి తీరంలో పూడ్చేసినట్లు ముందు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.