Jagananna Gorumudda: ఏపీలో బడి పిల్లలకు వారానికి 3 రోజులు ఉదయం పూట రాగి జావ, జగనన్న గోరుముద్ద కోసం అదనంగా రూ.86 కోట్ల ఖర్చు పెడుతున్న ఏపీ సర్కారు
బడి పిల్లల ఆరోగ్యం కోసం రాగా జావ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.
Ragi Java Programme for Students: సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బడి పిల్లల ఆరోగ్యం కోసం రాగా జావ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగి జావ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మధ్యాహ్న భోజన పథకానికి గత సర్కారు సగటున రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ద్వారా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఏటా రూ.1,824 కోట్లు వ్యయం చేస్తున్నారు. తాజాగా రాగి జావ కోసం ఏటా మరో రూ.86 కోట్లు కలిపి మొత్తం రూ.1,910 కోట్లు వెచి్చస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ రుచికరమైన మెనూతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) బెల్లంతో కూడిన రాగిజావను అందించనున్నారు.
ఇక మిగిలిన 3 రోజులు గోరుముద్దలో బలవర్థకమైన చిక్కీని పిల్లలకు ఇస్తున్నారు. జగనన్న గోరుముద్దలో వారానికి 15 వెరైటీలు ఉండగా ఐదు రోజుల పాటు కోడిగుడ్డు, 3 రోజులు చిక్కీ ఇస్తున్నారు. ఇకపై మూడు రోజులు రాగిజావ కూడా అందనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కావడం, చిరుధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో పథక నిర్వహణలో భాగంగా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు.