New Polytechnic Colleges in AP: యువత భవిష్యత్ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు, ఎక్కడెక్కడ అంటే..
యువత భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
Amaravati, Mar 21: యువత భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరుల్లో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోజకవర్గం డోన్ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల సీఎం వైఎస్ జగన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
దీంతో పాటుగా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్‌ను పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని నిబంధన ఉంది. దీనిని సవరించి.. మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
అలాగే ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్‌ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరగా.. దీనిపైనా సానుకూలంగా స్పందించిన సీఎం ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
(The above story first appeared on LatestLY on Mar 21, 2023 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

