COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షలు దాటిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, 18 వేల మందికి పైగా పాజిటివ్‌గా నిర్ధారణ, గత 24 గంటల్లో కొత్తగా 998 పాజిటివ్ కేసులు నమోదు
ఇప్పటివరకు 8,422 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 10,043 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...
Amaravati, July 5: కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షలు 10 లక్షల మార్కును దాటాయి. ఆదివారం నాటికి మొత్తం 10,17,140 సాంపుల్స్‌ను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందుకు గానూ ఇప్పటివరకు రాష్ట్రంలో 18,697 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 16,102 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
గత 24 గంటల్లో 20,567 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపగా, ఇందులో 998 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
AP COVID19 Report:
రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 14 కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్నూల్ నుంచి ఐదుగురు, అనంతపూర్ నుంచి ముగ్గురు, చితూరులో ఇద్దరు, కడప నుంచి ఇద్దరు, కృష్ణా మరియు విశాఖ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 232 కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 391 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,422 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 10,043 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.