Andhra Pradesh: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ. 20 వేలు కాదు రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా, క్లారిటీ ఇచ్చిన ఏపీ రవాణా శాఖ కమిషనర్
పదేపదే ఇదే నేరం చేస్తే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.
ఏపీలో హెడ్‌సెట్, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేసే వాహనదారులపై రూ.20 వేల జరిమానా వడ్డిస్తారన్న వార్తలపై ఏపీ రవాణా శాఖ కమిషనర్ స్పందించారు.ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. పదేపదే ఇదే నేరం చేస్తే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు విధిస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ చాలా కాలంగానే అమల్లో ఉన్నాయని చెప్పిన ఆయన, జరిమానా పెంపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని సూచించారు.