AP Special Status Row: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, పార్లమెంటులో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

పార్లమెంటులో కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

Union Minister of State for Home Nityanand Rai (File Photo/ANI)

New Delhi, mar 29: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ పరిస్థితి ఏమిటి? అంటూ రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. పార్లమెంటులో కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్‌ కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదని ఆయన అన్నారు.

రాష్ట్రాలతో కేంద్రం పంచుకునే పన్నుల రాబడి సమాంతరంగా జరగాలన్న ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే గతంలో పన్నుల పంపిణీలో 32 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 2015-2020 కాలానికి 42 శాతానికి పెంచినట్లు చెప్పారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రైల్వేలో 2.93 లక్షల ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపిన కేంద్రం

15వ ఆర్థిక సంఘం సైతం 2020-2026 కాలానికి ఈ పంపిణీ నిష్పత్తిలో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్తగా జమ్ము కశ్మీర్‌ రాష్ట్రంగా అవతరించినందున 42 శాతాన్ని 41 శాతానికి స్వల్పంగా తగ్గించినట్లు తెలిపారు. పన్నుల్లో వాటా పంపిణీ ద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును పూడ్చడం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో 90:10 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం భరించడం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిలో ఒక అంశం. 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో విదేశీ ఆర్థిక సంస్థల రుణ సహాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌ల వ్యయాన్ని వడ్డీతో సహా కేంద్రమే చెల్లించడం ప్యాకేజీలో ప్రధాన అంశమని చెప్పారు.

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత సానువులను ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము, కశ్మీర్‌ రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాల వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరిస్తాయని మిగిలిన రాష్ట్రాలలో ఈ నిష్పత్తి 60:40గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.