Andhra Pradesh: ప్రజాధనం వృథాపై విచారణ చేపట్టాల్సిందే, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీంకోర్టు

ఇరుపక్షాల వాదనలు ముగియగా.. సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ (Supreme court Judgment reserved) చేసింది

Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

Amaravati, Nov 17: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లు, గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై సిట్‌ ఏర్పాటు అంశంలో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై (Amaravati Land Scam and Fibernet) సిట్‌ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై (AP Govt Petition) విచారణ నేటితో పూర్తైంది. ఇరుపక్షాల వాదనలు ముగియగా.. సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ (Supreme court Judgment reserved) చేసింది

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధాన నిర్ణయాలు, ఆర్థిక, ఇతర అంశాలపై వైకాపా ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 21న సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. సిట్‌ ఏర్పాటుపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది.

షాకింగ్ వీడియో, టీడీపీ నేతను కత్తితో నరికేందుకు ప్రయత్నించిన దుండగుడు, భవాని మాల వేషంలో భిక్ష తీసుకుంటున్నట్లుగా నటిస్తూ దాడి

అంతకు ముందు విచారణ సమయంలో జస్టిస్‌ ఎం.ఆర్‌. షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం లేదంటే ఎలా? అలాంటి వారికి వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్లు కాదా? ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదా?.. దురుద్దేశం లేదని చెప్పేందుకే సీబీఐకి ఇస్తామని చెప్పారు కదా? దురుద్దేశం గనుక ఉంటే ఇవన్నీ దర్యాప్తులో తెలుస్తాయి కదా! అని ప్రశ్నించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఒక పోలీసు స్టేషన్‌లో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకు నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు.

విధాన నిర్ణయాలు, టెండర్, కాంట్రాక్టులకు సంబంధించిన కేసుల్లో సారూప్యం చూడాలని కోరారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్ధారణపై నిషేధం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ఇక వర్లరామయ్య తరపు న్యాయవాది దవే వాదనలు వినిపిస్తూ.. పక్షపాతంతో ఈ అంశంపై జివో ఇచ్చారని, అధికార పార్టీతో నిజనిర్దారణ ఏర్పాటుచేశారని వాదించారు. ఈ క్రమంలో ధర్మాసనం కలుగజేసుకుని.. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఏవైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా? అని ప్రశ్నించింది.