JC Prabhakar Reddy House Arrest: జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్, రోడ్డుపై పడిపోయిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రకటనలు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద దాదాపు 100 మంది పోలీసులు మోహరించారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
Tadipatri, April 24: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద దాదాపు 100 మంది పోలీసులు మోహరించారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
వివరాల్లోకి వెళ్తే, పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ కొంత కాలంగా జేసీ ఆరోపిస్తున్నారు. సోమవారం నుంచి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని, వాటిని తరలించే వాహనాలను తగులబెడతామని ఇటీవలే జేసీ ప్రకటించారు. ఈ క్రమంలో ఈరోజు పెద్దపప్పూరుకు వెళ్లేందుకు జేసీ తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఆయనను మళ్లీ బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు.
ఈ క్రమంలో ఆయన నేలపై పడిపోయారు. ఆ తర్వాత ఆయన ఇంటి ముందు కుర్చీలో కూర్చొని పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేయాలంటూ టీడీపీ శ్రేణులకు జేసీ పిలుపునిచ్చారు. ఇంకోవైపు పోలీసు అధికారులు స్పందిస్తూ... శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా జేసీ ప్రకటనలు చేశారని... అందుకే ఆయనను అడ్డుకున్నామని చెప్పారు