Low Pressure in Bay Of Bengal: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం, ఈ నెల 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Hyderabad, NOV 03: తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన గండం పొంచి ఉంది. ఈ నెల 5 లేదా 6న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. ఇప్పటికే దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 5 లేదా 6వ తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తూర్పు తీరం వైపు నుంచి ఈశాన్య వైపుగా గాలులు సైతం వీస్తుండటంతో రాష్ట్రంలోని పలు చోట్ల వానలు పడే అవకాశం ఉందంది.
అల్పపీడనం ఏర్పడినట్లైతే.. 11వ తేదీ వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం తుపాను సీజన్ నడుస్తోంది. డిసెంబర్ మొదటి వారం వరకు తుపాన్లు ఏర్పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు చూసుకుంటే బంగాళాఖాతంలో దాదాపు 9 వరకు అల్పపీడనాలు ఏర్పడటం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 6 శాతంపైగా వర్షపాతం నమోదైంది.
రాబోయే అల్పపీడనాల ప్రభావంతో వర్షపాతం నమోదు శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు ఏర్పడిన అల్పపీడనాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు (heavy rains) నమోదయ్యాయి. 19 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్పపీడనం ఏర్పడితే సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం రాయలసీమ జిల్లాల్లో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే, అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఇది బలపడుతుందా? లేక బలహీనపడుతుందా? అనేది దాన్ని గమనం బట్టి అంచనా వేయొచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. అల్పపీడన ప్రభావంతో రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది. అంతేకాదు.. 6వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు సైతం మరింత తగ్గుముఖం పట్టి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.