AP Assembly Sessions 2022: వేలకోట్లు బటన్ నొక్కి వేస్తున్నాం, రూ. 500 కోట్లు వేయలేమా, టీడీపీ నేతకు అసెంబ్లీలో సీఎం జగన్ సమాధానం, అసెంబ్లీలో పోలవరంపై కొనసాగుతున్న చర్చ
ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే.. పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై చర్చ సాగనుంది.
Amaravati, Sep 19: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు (AP Assembly Monsoon Sessions 2022) ప్రారంభం అయ్యాయి. ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే.. పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై చర్చ సాగనుంది. అంతేకాదు.. విద్య, వైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చతో పాటు సభలో నేడు 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ముందుగా పోలవరంపై చర్చ జరిగింది.
పోలవరం నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేశాం. టీడీపీ సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలవరంపై మాట్లాడుతూ నిర్వాసితులకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పారని అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించారని మండిపడ్డారు.
దీనికి సీఎం జగన్ బదులిస్తూ తప్పకుండా నిర్వాసితులకు రూ. 10 లక్షల పరిహారం ఇస్తామని దీనికి గతంలోనే జీవో జారీ చేశామని బదులిచ్చారు. వేల కోట్లు బటన్ నొక్కి ఖాతాల్లోకి వేస్తున్న ప్రభుత్వం మాది. రూ.500 కోట్లు వేయలేమా అని సీఎం జగన్ ప్రశ్నించారు. పోలవరంపై చెప్పిన దానికి జీవో కూడా ఇచ్చాం. ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గతంలో రూ. 6.86 లక్షలు ఇస్తే, అధికారంలోకి వచ్చాక రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పామని సీఎం జగన్ అన్నారు.
సీఎం జగన్ పూర్తి స్పీచ్
పోలవరం ప్రాజెక్టుకు సంబధించి ఏం చెప్పామో.. దానికి జీవో కూడా 30 జూన్ 2021 నాడు జారీ చేశాం. మేం చెప్పిన మాట ఏమిటి ?అన్నది ఒక్కసారి గమనిస్తే... ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గతంలో చంద్రబాబు హయాంలో రూ.6.86 లక్షలు ఇస్తే.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ.10 లక్షలు చేస్తాం అని చెప్పాం. అన్నదానికి తగినట్లుగా జీవో కూడా జారీ చేశాం. దాని గురించి ఆక్షేపణ లేదు, చర్చ కూడా లేదు. కళ్లు ఉండి చూడలేకపోతే సమాధానం చెప్పలేం కానీ... కళ్లు ఉండి చూడగలిగితే చూడాలని చెప్తున్నా.
ఈ జీవోలో ఆర్ అండ్ ఆర్ కింద మేం చెప్పిన దానిపై జీవో జారీ చేశాం. దానికి కట్టుబడి ఉన్నాం. డ్యాం పూర్తయిన తర్వాత మొదట నీటిని 41.15 మీటర్ల ఎత్తులో నిల్వ చేస్తాం. ఎందుకంటే డ్యామ్ భద్రత దృష్ట్యా.. కేంద్రజలసంఘం నిబంధనల మేరకు, డ్యామ్‌లో ఒకేసారి పూర్తిస్ధాయిలో నీటిని నిల్వ పెట్టడం సరికాదు. ఆ మేరకు 41.15 మీటర్లకు సంబధించి డ్యామ్‌లో నీటి నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది.
పోలవరం ప్రాజెక్టులో 1,06,006 మంది నిర్వాసితులకు గాను... 41.15 మీటర్ల కాంటూర్‌కు పరిధి వరకు.. 20,946 మంది నిర్వాసితులు వస్తారు. మిగిలిన 85,060 మంది నిర్వాసితులు 45.72 కాంటూర్ లెవల్ కిందకు వస్తారు. వీరిలో 41.15 కాంటూర్ లెవల్‌కు వచ్చే 14,110 నిర్వాసితులకు పునరావాసం పూర్తయింది. దీనికి అయిన ఖర్చు రూ.1960.95 కోట్లు. ఈ 14,110 మంది నిర్వాసితులలో 707 నిర్వాసితులకు 2014 కన్నా ముందే పునరావాసం కల్పించి.. రూ.44.77 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 2014–19 వరకు 3073 నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.193 కోట్లు ఖర్చు చేశాం. అలాగే 2019 నుంచి ఇప్పటివరకు 10,330 మంది నిర్వాసితుల కోసం రూ.1773 కోట్లు ఖర్చు చేశాం. పునరావాసపనులు 41.15 కాంటూర్ వరకు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబరు 2022 లోగా మిగిలిన 6836 నిర్వాసిత కుటుంబాలకు కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళిక చేయడం జరుగుతుంది.
మొత్తం 41.15 కాంటూర్ వరకు చెల్లించాల్సిన పరిహారం రూ.6.86 లక్షలకు బదులు మేం రూ.10 లక్షలు పెంచుతామని చెప్పిన ఖర్చు కేవలం రూ.500 కోట్లు మాత్రమే. మీరెవ్వరూ(విపక్షాలు) భయపడాల్సిన పనిలేదు, బాధపడాల్సిన పనీ లేదు. బటన్ నొక్కితే రూ.6500 కోట్లు, రూ.6700 కోట్లు అమ్మఒడి, ఆసరా, చేయూతకు రూ.4700 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. అటువంటిది రూ.500 కోట్లు ఇచ్చేందుకు చేయలేకుండా ఉండే పరిస్థితులు వస్తాయని ఎవరూ అనుకోవాల్సిన పనిలేదు. 41.15 కాంటూర్ లెవల్ వరకు ఎప్పుడైతే పూర్తిగా పునరావాసం కల్పించే కార్యక్రమం పూర్తవుతుందో.. వాళ్లందరికీ ఆ లోపే రూ.500 కోట్లు ఇస్తాం.
మీకు ఇంకో విషయం కూడా తెలియాల్సి ఉంది. రూ.2900 కోట్లు కేంద్రప్రభుత్వం నుంచి మనకు రావాల్సి ఉంది. మనం ఎదురు డబ్బులు ఇచ్చాం. అటువైపు కేంద్రం నుంచి ఆ డబ్బులు రాలేదు. దీనికి సంబంధించి ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం..ఆ రోజు చంద్రబాబునాయుడు గారు అర్ధరాత్రి పూట లేని స్పెషల్ ప్యాకేజీ అని ఒకదాన్ని అంగీకరించడమే. 2011 ప్రకారం పాత రేట్ల ఇస్తాం అంతకన్నా ఎక్కువ ధర ఇవ్వము అని వాళ్లు చెపితే... ఏదైనా ప్రాజెక్టు ముందుకు పోయేకొద్దీ రేట్లు పెరుగుతాయి కదా ? పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా ? పోలవరం ప్రాజెక్టు అధారిటీ అన్నది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీయే కదా ? వాళ్లే కదా అమలు చేస్తున్నారు ? రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేట్ మాత్రమే చేస్తుంది కదా ? మరి అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా ? కరెక్టేనా ? అని అడగాల్సింది పోయి, ఆ రోజు గుడ్డిగా దానికి అంగీరించాం అని చెప్పారు. దానికి తోడు ఢిల్లీలో మీ వాళ్లే స్టేట్‌మెంట్ ఇప్పించారు. ఆ రోజు అరుణ్ జైట్లీ అర్ధరాత్రి స్టేట్‌మెంట్ ఇస్తుంటే... పక్కనే మీ సుజనా చౌదరి, కేంద్ర కేబినెట్‌లో ఉన్న మీ మంత్రులు అందరూ పక్కనే నిలబడి దానికి అంగీకరించారు.
మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైన ప్యాకేజీ వచ్చిందని.. సిగ్గులేకుండా చెప్పారు. పూర్తిగా ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి, ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు దానివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధంచి మేము ఆ పాతరేట్లే ఇస్తాం.. వేరే రేట్లు ఇవ్వం అని వాళ్లు గట్టిగా భీష్మించుకుని కూర్చున్న నేపధ్యంలో వాళ్లను ఒప్పించడానికి ఇన్ని అగచాట్లు పడుతున్నాం. ఒకవైపు ఈ అగచాట్లు పడుతూనే...మరోవైపు రూ.2.900 కోట్లు ఎదురు మన డబ్బులే ఇచ్చాం. ప్రాజెక్టు నిర్మాణంలో మన డబ్బే ఇరుక్కుని ఉంది. ఆడబ్బులు ఇంకా వెనక్కి తీసుకురాలేకపోతున్నాం. కారణం మీ పుణ్యమే.
ఒకవైపు ఈ విషయాలు ఇలా ఉంటే... ఇంకోవైపు గతంలో రూ.1.50లక్షలు ఎవరికైతే ఇచ్చారో, అది కూడా తక్కువ మొత్తం.. వాళ్లకు కూడా పెంచి రూ.5లక్షలు ఇస్తామని చెప్పాం. ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరూ బాధపడావల్సిన పనిలేదు. కచ్చితంగా అన్నీ జరుగుతాయి. పునరావాసం మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో కలిపి కేవలం 3,073 మందికి రూ.193 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. పునారవాసం మీద మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమూడు సంవత్సరాలలో 10,330 నిర్వాసిత కుటుంబాలకు రూ.1773 కోట్లు ఖర్చు చేశామని తలెత్తుకుని సగర్వంగా తెలియజేస్తున్నాను.
పునరావాసానికి సంబంధించి మీకున్న చిత్తశుద్ధి ఏమిటో, మాకున్న చిత్తశుద్ధి ఏమిటో ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరం లేదని తెలియజేస్తున్నాను.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఏ జరిగిందో... మన హయాంలో ఏం జరిగిందో స్లైడ్లు కూడా చూద్దాం... (పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సీఎం)
అప్రోచ్ ఛానెల్‌కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూన్ 2019లో బీడు, బీడుగా ఉన్న భూములో నుంచి... ఏకంగా అప్రోచ్ ఛానెల్ తయారు చేసి, నీళ్లను డైవర్ట్ చేసే కార్యక్రమం ఈరోజు కనిపిస్తోంది.
ప్రాజెక్టు పురోగతితో పాటు చంద్రబాబునాయుడు ప్రాజెక్టును ఏరకంగా దగ్గరుండి నాశనం చేశారో కూడా చూపిస్తాం. నాశనం చేసిన దాన్ని రిపేరు చేయడానికి మేం ఎన్నెన్ని కుస్తీలు పడుతున్నామో కూడా చూపిస్తాం.
నాశనం చేసింది మీరు.. ఎలా చేశారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు బీడుగా పెట్టిన అప్రోచ్. గోదావరి నది 2.1 కిలోమీటర్ల వెడల్పుగా పవహిస్తుంది. నదిలోకి నీళ్లు వస్తున్నప్పుడు అటువైపు స్పిల్‌వే కట్టాలి. స్పిల్‌వే పూర్తి చేసి నీళ్లు (స్పిల్‌వేవైపు) అటువైపు మళ్లించి.. స్పిల్‌వే గుండా నీళ్లు అటు తీసుకుని, అప్పుడు కాఫర్ డ్యాం పనులు చేయాలి. కాఫర్ డ్యాం తాత్కాలిక నిర్మాణం. అది మెయిన్ డ్యాం కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. స్పిల్‌వే పనులు పూర్తి చేసిన తర్వాత, అఫ్రోచ్ ఛానెల్ పూర్తి చేసిన తర్వాత.. నీళ్లు మళ్లించడానికి వెసులుబాటు కల్పించిన తర్వాత.. కాఫర్ డ్యాం కట్టాలి. దాని తర్వాత మెయిన్ డ్యాం కట్టాలి. కాఫర్ డ్యాం –1, మధ్యలో మెయిన్ డ్యాం, ఇటువైపు నుంచి నీళ్లు తన్నకుండా కాఫర్ డ్యాం –2 కట్టాలి. కాఫర్ డ్యాం 1, కాఫర్ డ్యాం 2, మెయిన్ డ్యాం ఈ పనులు జోలికి పోకమనుపే స్పిల్‌వే పనులు పూర్తి కావాలి. స్పిల్‌వే పనులు పూర్తి చేసి.. అప్రోచ్ ఛానెల్ పనులు పూర్తి చేసి, నీళ్లు అటువైపు మళ్లిస్తే.. అప్పుడు ఈ 2.1 కిలోమీటర్ల పొడవైన గోదావరి నదిలో కాఫర్ డ్యాం కట్టగలుగుతాం.
అటువంటిది 40 యేళ్ల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకునే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలివితేటలున్నాయో కానీ.. ఎమ్మెల్యే కావడానికి కూడా అర్హుడు కాదు. ఆ స్ధాయిలో మాయ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటంటే.. ఒకవైపు స్పిల్‌వే పూర్తి కాకుండా, మరోవైపు అప్రోచ్ ఛానెల్ పూర్తి కాకుండా, మరోవైపు 2.1 కిలోమీటర్ల పొడవులో అప్పర్ కాఫర్ డ్యాం కూడా పూర్తి చేయలేదు. దానిలోనూ రెండు గ్యాప్‌లు విడిచిపెట్టారు. లోయర్ కాఫర్ డ్యాంలోనూ రెండు గ్యాప్‌లు విడిచిపెట్టారు. దీనివల్ల నీరు అటు స్పిల్‌వే వైపు పోలేకపోయింది.. 2.1 కిలోమీటర్ల వెడల్పుతో పోవాల్సిన నీరు పోలేక... మీరు వదిలిపెట్టిన ఆ గ్యాప్‌ల గుండా పోవాల్సి వచ్చింది. దాంతో గ్యాప్ తక్కువ కావడంతో నీటి వేగం పెరిగి..కోతకు గురైంది. మీరు ప్రణాళిక లేకుండా కట్టడం వల్లే ఇలా జరిగింది. మీ ఇష్టం వచ్చిన వాళ్లను అడగండి.. పార్టీలతో సంబంధం లేకుండా ఏ తటస్థ వ్యక్తినైనా అడిగి చూడండి. ఈయన్ని (చంద్రబాబునాయుడు గారిని) ముఖ్యమంత్రి ఎవరు చేశారయ్యా అని అడుగుతారు. ఇంత వెధవ పని ఎవరయ్యా చేసింది అని ఎవరైనా చెబుతారు.
కానీ మీరు దగ్గరుండి చేయించారు. ఈ రోజు మీరు చేయించిన తప్పును ఎదుటవాళ్లమీద వేలెత్తి చూపించడానికి రకరకాల కుయుక్తులు పన్నతున్నారు. మా ఖర్మ ఏమిటంటే... మీకే ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, టీవీ5 ఉంది. ఎల్లో మీడియా మొత్తం మీదే. అబద్దాన్ని నిజం చేయడానికి గొబెల్స్ ప్రచారాలు మొదలుపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.
అప్రోచ్ చానెల్ పూర్తి కాకపోవడంతో మేం వచ్చేటప్పుడి అసంపూర్తిగా ఉంది. మే నెలలో అప్రోచ్ ఛానెల్‌లో మేం పనులు మొదలుపెట్టి చేశాం. జూన్ 2021 నాటికి అప్రోచ్ ఛానెల్‌లోకి నీళ్లు మళ్లించాం. మార్చి 2022 నాటికి అప్రోచ్ ఛానెల్ పూర్తయితే.. నీళ్లు మళ్లించాం. స్పిల్‌వే నుంచి నీళ్లు వచ్చేదానికి సిద్దం అయ్యింది. డ్యాం పూర్తి చేసి, స్పిల్‌వే గేట్ల కూడా పెట్టాం. ఇప్పుడు నీళ్లు కిందకు వస్తున్నాయి. ఇది ముందు జరగాల్సింది. ఇది జరగకుండా కాఫర్ డ్యాం పనులు మొదలుపెట్టి, అవి పూర్తి కాకుండా..2.1 కిలోమీటర్ల పొడవైన గోదావరి నదిని పూర్తిగా రెండు గ్యాపులు వదిలేసి.. కాఫర్ డ్యాం కట్టించారు. నీళ్లు ఆ గ్యాపులు గుండా పోవడంతో కోతకు గురైంది. ఇది వాస్తవం.
చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్‌వే పనులు ఏమాత్రం పూర్తి కాకుండా, పునాదులు వేసి... ఏకంగా ఆయన కొడుకు, మనవడు, భార్య.. జయము, జయము చంద్రన్నా అంటూ పనులు పూర్తయినట్టు ఇంప్రెషన్ ఇచ్చారు. 2019 మార్చిలో (అప్పటి ఫోటో చూపిస్తూ) పిల్లర్లు పైకి లేచిన తర్వాత గేట్లు పెట్టాలి. గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్‌వే పూర్తి కాదు. కానీ పిల్లర్లు పూర్తవలేదు. మేం వచ్చిన తర్వాత ఈపనులను ముందుకు తీసుకునిపోయాం.
జూన్ 2022 నాటికి(ఫోటో చూపిస్తూ..) మీరు వదిలేసిన పనులను పూర్తి చేశాం. గణనీయమైన ప్రగతి అంటే ఇది. పిల్లర్లు పూర్తి చేయడమే కాకుండా.. గేట్లు పెట్టి, అప్రోచ్ చానెల్ నుంచి నీళ్లు మళ్లించి, స్పిల్ ఛానెల్ నుంచి నీళ్లు బయటకు పోయేటట్టు చేస్తున్నాం. ఇధి చేయకుండా బుద్ది ఉన్నవాళ్లెవరైనా కాఫర్ డ్యాం కడతారా ? మీ మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
నవంబరు 2019, ఆగష్టు 2022 (స్పిల్‌వే పోటోలు చూపిస్తూ...) పనులు పురోగతిని వివరించిన సీఎం.
2019లో 2.1 కిలోమీటర్ల నదిలో కాఫర్ డ్యాంలో రెండు గ్యాపులు వదిలిపెట్టారు. ఎగువ కాఫర్ డ్యాంలో ఒకచోట 380 మీటర్ల గ్యాప్, మరోచోట 300 మీటర్ల గ్యాప్ వదిలిపెట్టారు. అంటే 2.1 కిలోమీటర్ల నుంచి పోవాల్సిన నీళ్లను మీ పుణ్యాన ఈ రెండు గ్యాప్‌ల నుంచి పోయే పరిస్థితికి వచ్చేసరికి కోతగు గురైంది. దిగువ కాఫర్ డ్యాంలో ఒకవైపు 680 మీటర్లు, మరోవైపు 120 మీటర్ల గ్యాప్ వదిలారు. నీళ్లన్నీ ఈగ్యాప్‌ల నుంచి పోవాల్సిన పరిస్థితి. దీంతో కోత జరిగింది. ఇప్పుడు దాన్ని మరలా పునరుద్ధరించాల్సి వచ్చింది. డయాఫ్రమ్ కింద నుంచి కోతకు గురైంది. గుంతలు పడ్డాయి. దాన్ని మరలా కట్టుకుంటూ వస్తున్నాం. ఆలస్యం కావడానికి కారణం మీరు చేసిన ఈతప్పుడు పనులు. మీరు చేసిన తప్పులు మీకు అర్ధం కాకపోగా.. మరలా అవతలి వాళ్ల మీద వేలెత్తి చూపడానికి మీకు(తెలుగుదేశంపార్టీకి) మనసెలా వస్తుంది ? మనుషుల్లా ఆలోచన చేస్తున్నారా? రాక్షసుల్లా ఆలోచన చేస్తున్నారా? దీనికి పూర్తిగా మీరు బాధ్యత తీసుకోవాలి. వేలెత్తి ఎవరిమీదో చూపించాలనే మీ దుర్భిద్ధే కనిపిస్తోంది. మెయిన్ డ్యాంలో కూడా గ్యాపులు ఉంచారు.
మొత్తంగా అప్పర్ కాఫర్ డ్యాం అయిపోయింది. లోవర్ కాఫర్ డ్యాం 30.5 మీటర్లు ఎత్తు పెంచాల్సిన చోట.. వరద అనుకున్న దానికన్నా ఎక్కువగా రావడంతోపాటు, కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన డిజైన్లు క్లియరెన్స్‌లో అనుకున్నదానికన్నా జాప్యం జరిగింది. దానివల్ల లోయర్ కాఫర్ డ్యాం అనుకున్న మేరకువేగంగా పని జరగలేదు. ఇది 30.5 మీటర్ల ఎత్తుకు కట్టాల్సి ఉండగా... 21 నుంచి 23 మీటర్ల ఎత్తువరకే కట్టగలిగారు. ఇక్కడ ఉన్న 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో మరొకటి ఇలా రెండు గ్యాప్‌లను కింద పునాదుల నుంచి వేసుకుని రావడం వల్ల ఆలస్యం అయింది.
కొద్దిగా సమయం దొరికితే 30.5 మీటర్ల వరకు కూడా లోవర్ కాఫర్ డ్యాం పూర్తయ్యేది. వర్షాకాలంలో పనులు జరగని పరిస్థితి వచ్చింది. అక్టోబరులో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబరులో పనులు మొదలవుతావు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేందుకు అడుగులు ముందుకు పడతాయి. ఇది వాస్తవం. దీన్ని వక్రీకరించి మీరు ఏ రకంగా చూపించాలని ప్రయత్నం చేసినా కూడా... దానివల్ల ప్రజల్లో మీరే చులకన అవుతారు. ప్రజలకు అన్నీ తెలుసు. తెలియదని మీరు అనుకుంటున్నారు. మీరే చులకన అవుతారు గుర్తుపెట్టుకొండి అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు