AP Assembly Session 2021: కొలిక్కిరాని ఏపీ రాజధాని, పూర్తి సమగ్రమైన బిల్లును ప్రవేశపెడతామని తెలిపిన సీఎం జగన్, ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటన
చంద్రబాబు అంచనా ప్రకారమే అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు కోసం లక్షకోట్లు ఖర్చవుతాయని, ఇప్పుడు లక్షకోట్ల అంచనా అంటే పదేళ్ల తర్వాత లక్ష కోట్లు ఆరేడు లక్షల కోట్లు కావొచ్చునని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఈ డబ్బుతో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వేయడం కూడా సాధ్యం కాదన్నారు.
Amaravati, Nov 22: ఏపీ అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు (AP Assembly Session 2021) వచ్చింది. ఈ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట‍్టగా.. బిల్లుపై చర్చకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించారు. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని అన్నారు.
చంద్రబాబు అంచనా ప్రకారమే అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు కోసం లక్షకోట్లు ఖర్చవుతాయని, ఇప్పుడు లక్షకోట్ల అంచనా అంటే పదేళ్ల తర్వాత లక్ష కోట్లు ఆరేడు లక్షల కోట్లు కావొచ్చునని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఈ డబ్బుతో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వేయడం కూడా సాధ్యం కాదన్నారు. ఇలాంటప్పుడు రాజధాని ఏర్పాటు సాధ్యమేనా? పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే నగరం ఎప్పటికి వస్తుంది? అని ప్రశ్నించారు.
చదువుకున్నవాళ్లంతా పెద్ద నగరాలైన బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా అని అడిగారు. ఇప్పుడు ఏపీలో పెద్ద నగరం విశాఖపట్నం అని, అక్కడ ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని, సుందరీకరణ, వసతులపై శ్రద్ధ పెట్టి, విలువ పెంచితే ఐదు, పదేళ్లలో హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో కచ్చితంగా పోటీ పడుతుందని జగన్ చెప్పారు.
ఇది వాస్తవ పరిస్థితి అని, ఇలాంటి వాస్తవాలను గుర్తెరిగే.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి, రాష్ట్రం పరిగెత్తాలనే తాము విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, అమరావతిలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలని నిర్ణయించామన్నారు. అయితే, తమ నిర్ణయంపై రకరకాల అపోహలు రేకెత్తించి, న్యాయపరమైన చిక్కులు కల్పిస్తున్నారని చెప్పారు. తాము ప్రకటించిన వెంటనే పనులు ప్రారంభించి, అమల్లోకి తీసుకొస్తే ఈపాటికే వికేంద్రీకరణ ఫలితాలు చూసేవాళ్లమని జగన్ ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లులపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు. ఈ రెండు ప్రాంతాలతో పోలిస్తే, హైదరాబాద్ రాజధానిగా కలిగిన తెలంగాణ అభివృద్ధిలో ఒక మెట్టు పైనే ఉందని అన్నారు.
మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. త్వరలోనే సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో ముందుకు వస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.
అంతకు ముందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను ప్రస్తావించిన బుగ్గన.. హైదరాబాద్‌లోనే మొత్తం అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే వెనుకబాటుతనంపై చర్చ జరిగిందని, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చిందని తెలిపారు. అలాగే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కేంద్రీకరణ జరగకూడదని శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు నివేదించాయని తెలిపారు. అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయొద్దని శివరామకృష్ణన్ స్పష్టంగా చెప్పారన్నారు.
ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలే రాష్ట్రాభివృద్ధికి కీలకంగా ఉండేవని, అవే రాష్ట్రాలను అభివృద్ధి చేసేవని బుగ్గన తెలిపారు. అయితే, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక సహా చాలా రాష్ట్రాలు అభివృద్ధి వికేంద్రీకరణకే ప్రాధాన్యం ఇచ్చాయని, కాబట్టే ఆయా రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 శాతం సంస్థలను హైదరాబాద్‌లోనే పెట్టారని, దీనివల్లే హైదరాబాద్ మహానగరం అయ్యిందని.. ఉమ్మడిగానే కొనసాగితే ఇంకా పెద్ద నగరం అయ్యేదని బుగ్గన అన్నారు. అయితే, దీనివల్ల మిగతా రాష్ట్రం మొత్తం వెనకబడిందని చెప్పారు.
ఇలా అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్లనే ప్రత్యేకవాదం బలపడిందని శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసెంబ్లీలో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని బుగ్గన ఆరోపించారు.ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లా సమానంగా అభివృద్ధి చెందాలని తాము నిర్ణయించామన్నారు.
ముంబాయి మహా నగరం 4 వేల కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందగా.. అమరావతిని 7500 కిలోమీటర్లు మేర అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు కాల్పనిక అంచనా వేశారన్నారు. చంద్రబాబు హయాంలో ఏమాత్రం చిత్తశుద్ధి, ఆలోచన లేకుండా నిర్ణయాలు జరిగాయని బుగ్గన ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, చంద్రబాబు అంచనా ప్రకారం అభివృద్ధి చేయాలంటే కనీసం లక్ష కోట్లు కావాలని, ఇలా చేయడం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యమేనా? అని బుగ్గన ప్రశ్నించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా కొన్ని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించామన్నారు. అన్ని రకాల సహాయక చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇక ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా పడింది.