AP Budget 2023: గతేడాది ఏపీ అప్పులు భారీగా తగ్గాయి, ద్రవ్య లోటు అదుపులోకి వచ్చిందని తెలిపిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్

2021–22 ఆర్థిక ఏడాదిలో (financial year 2021-22) ద్రవ్య లోటు రూ.25,011 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గురువారం అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా వెల్లడించారు.

Buggana rajendranath (Photo-Video Grab)

Amaravati, Mar 17: 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఏడాది ద్రవ్య లోటు (Fiscal deficit) అదుపులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఖరారు చేసిన అకౌంట్స్‌ ప్రకారం.. 2021–22 ఆర్థిక ఏడాదిలో (financial year 2021-22) ద్రవ్య లోటు రూ.25,011 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గురువారం అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా వెల్లడించారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 2.08 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. అంతేకాక.. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల కన్నా తక్కువన్నారు. వాస్తవానికి.. ఆ ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.37,029 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే, 2021–22 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.8,610 కోట్లుగా కాగ్‌ ఖరారు చేసిందని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.72 శాతంగా ఉందని మంత్రి వివరించారు.

రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌, అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​కు రూ.21,434.72 కోట్లు, వార్షిక బడ్జెట్‌ హైలెట్స్ ఇవిగో..

మరోవైపు.. ద్రవ్య లోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు 2023–24 ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో గట్టి ప్రయత్నమే చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,83,008.96 కోట్లకు చేరుతాయని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.32 శాతంగా ఉంటుందని బడ్జెట్‌ పత్రాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,26,233.92 కోట్లుగా ఉంటాయని పేర్కొంది.