CM YS Jagan Delhi Tour: హోం మంత్రితో ఏపీ సీఎం చర్చించిన విషయాలు ఇవే, అమిత్ షాతో ముగిసిన వైయస్ జగన్ భేటీ, పోలవరంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలపై ప్రధానంగా చర్చలు
పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై (Discusses Polavaram Project and Other Issues) సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారని.. చర్చకు వచ్చిన అన్ని అంశాలపై హోం మంత్రి (Home Minister Amit Shah) సానుకూలంగా స్పందించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Amaravati, Jan 20: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి (CM YS Jagan Delhi Tour) వెళ్లిన విషయం విదితమే.. ఈ టూర్లో భాగంగా మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి.. రాత్రి 9.15 గంటల నుంచి 10.40 గంటల వరకు హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై (Discusses Polavaram Project and Other Issues) సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించారని.. చర్చకు వచ్చిన అన్ని అంశాలపై హోం మంత్రి (Home Minister Amit Shah) సానుకూలంగా స్పందించారని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం (AP CM Jagan mohan Reddy) వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అధికార ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రకటన ప్రకారం..ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేందుకు వీలుగా కేంద్రం సహకరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) సిఫారసు మేరకు రెండో సవరించిన అంచనా వ్యయానికి (ఆర్‌సీఈ) ఆమోదం తెలపాలని కోరారు. 2017 – 18 ధరల సూచీని పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా ఆమోదించాలని, ఈ మేరకు రెండో రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ (ఆర్‌సీఈ)కు ఆమోదం తెలిపేలా కేంద్ర జల శక్తి శాఖకు సూచించాలని అమిత్‌షాను ముఖ్యమంత్రి కోరారు.
ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై ఒక లేఖ సమర్పించి, అందులో అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ కింద సేకరించాల్సిన భూమి 1,02,130 ఎకరాల నుంచి 1,55,465 ఎకరాలకు పెరిగిందని నివేదించారు. 2013 భూసేకరణ, పునరావాస చట్టం కింద క్షేత్ర స్థాయి సర్వే తర్వాత భూ సేకరణలో 55,335 ఎకరాలు పెరిగిందని చెప్పారు. ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిందని వివరించారు. 2018 డిసెంబర్ నుంచి చెల్లించాల్సిన రూ.1,644.23 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించేలా చూడాలని అభ్యర్థించారు.
Here's CMO Andhra Pradesh Tweet
దీంతో పాటుగా 2014–15 నాటికి రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కానీ రూ. 4,117.89 కోట్లుగా మాత్రమే కేంద్రం గుర్తించింది. ఇందులో కూడా రూ.3,979.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన బకాయిలతో పాటు, రాష్ట్రం పేర్కొన్న విధంగా మిగిలిన రూ.18,830.87 కోట్లు విడుదల చేయాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఆయకట్టు పెరగడం కానీ, కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకోవడం కానీ జరగదు. వన్యప్రాణి అభయారణ్యాలకు భంగం కానీ, ఇతర పర్యావరణ ఇబ్బందులు కానీ తలెత్తవు. అందువల్ల దీనికి త్వరితగతిన అనుమతి ఇచ్చేలా సంబంధిత శాఖకు సూచించాలని హోం మంత్రిని ఏపీ సీఎం కోరారు.
ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడంలో భాగంగా అధికార వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ఆగస్టులో ప్రాంతాల వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం–2020 తెచ్చింది. ఈ దిశగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొందని హోం మంత్రికి గుర్తు చేశారు.
విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలను గుర్తించింది. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తగిన చర్యలను సంబంధిత శాఖ తీసుకునేలా చూడాలి. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇది చాలా అవసరమని ఏపీ సీఎం కోరారు. దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి రాష్ట్రపతి ఆమో దం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర విభజన తర్వాత రూ.5,541.78 కోట్లను విద్యుత్ కొనుగోలు రూపంలో ఏపీ జెన్‌కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షరతులతో కూడిన రుణాలను తెలంగాణ డిస్కంలకు ఇవ్వడం ద్వారా ఏపీ జెన్‌కోకు ఆ చెల్లింపులు జరిగేలా చూడాలి. అప్పర్ సీలేరులో చేపడుతున్న 1350 మెగావాట్ల రివర్స్ పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుకు సుమారు రూ. 8,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి కేంద్రం ఆర్థిక సహాయం అందించాలి. అలాగే అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలన్నారు.
రాష్ట్రంలో జనవరి 16 నుంచి 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. (రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డేటాను వివరిస్తూ ఒక లేఖ అందజేశారు) వచ్చే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. నాణ్యమైన వైద్య సేవల కోసం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉంది. దీనికోసం కొత్తగా 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వీటితోపాటు ఇదివరకే ఉన్న మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇప్పటికే మూడు కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన 13 కాలేజీలను, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను మంజూరు చేయాలి. వీటి అనుమతులకు వెంటనే ఆమోదం తెలపాలి. కాలేజీల ఏర్పాటుకు తగినంత ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు.
అంగన్‌వాడీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలి. ఉపాధి హామీ కార్యక్రమాల కోసం పెండింగులో ఉన్న రూ.3,707.77 కోట్ల మేర నిధులు విడుదల చేయాలి. లాక్‌డౌన్ తదనంతర పరిణామాల్లో భాగంగా చాలా మంది తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సి ఉంది. ఉపాధి హామీ కింద ప్రస్తుతం ఉన్న పనిదినాలు 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని హోం మంత్రిని కోరారు.
జాతీయ విపత్తు నిధి కింద నివర్ తుపాను బాధిత ప్రాంతాల్లో చర్యలకు ఆర్థిక సహాయం చేయాలి. ఎన్డీఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం బాధిత ప్రాంతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ, తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం రూ.2,255.7 కోట్లను విడుదల చేయాలని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఏపీ సీఎం కోరారు. ఎగువ సీలేరులో చేపడుతున్న 1,350 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని.. దీనికి కేంద్రం ఆర్థిక సాయం చేయడంతో పాటు అటవీ, పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,282 కోట్లను కేంద్రం విడుదల చేయాలని సీఎం కోరారు.
14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు స్థానిక సంస్థలకు రూ.529.95 కోట్ల మేర విడుదల చేయాలి. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు రెండో విడత కింద గ్రామీణ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన రూ.1,312.5 కోట్లను వెంటనే విడుదల చేయాలి. కోవిడ్ నివారణ చర్యలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టడానికి ఈ నిధులు ఎంతో అవసరమని హోం మంత్రితి ఏపీ సీఎం తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి.. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)