Andhra Pradesh Family Physician: ఈ నెల 21న ఫ్యామిలీ ఫిజీషియన్ పథకం ప్రారంభించనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పేదల గడప వద్దకు వైద్యం చేరవేయడమే లక్ష్యంగా ఫ్యామిలీ ఫిజీషియన్ రూపకల్పన
ఇప్పటి వరకు ఫ్యామిలీ డాక్టర్ సేవలు సంపన్న వర్గాలకే పరిమితమయ్యాయన్నారు.
పేదలకు వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ డాక్టర్ సేవలు సంపన్న వర్గాలకే పరిమితమయ్యాయన్నారు. నడవలేని స్థితిలో ఆసుపత్రులకు చేరుకోలేని వారికి నేరుగా గడప వద్దకే వైద్య సేవలు అందించడమే ఈ ఫ్యామిలీ ఫిజీషియన్ విధాన లక్ష్యంగా ఏపీ ప్రభుత్వంఈ పథకం ప్రారంభించనుంది. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకువచ్చింది. గ్రామీణ పేద ప్రజలకు, గ్రామాలను సందర్శించే ప్రభుత్వ వైద్యాధికారులకు మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కాన్సెప్ట్ తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఈ కాన్సెప్ట్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు ప్రకటించారు.
నిపుణుల కమిటీ సిఫార్సులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, భాగస్వాములతో సమగ్రంగా చర్చలు జరిపిన అనంతరం సెకండరీ, టెరిటరీ ఆస్పత్రులపై పెరుగుతున్న రోగుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామం ఒక యూనిట్‌గా ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ వసతులను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు సీఎం జగన్ అనేక చర్యలు ప్రారంభించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే.. ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
ఈనెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడించారు. రానున్న జనవరిలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి, ఆయనతో పాటు మరికొంత మంది సిబ్బందితో కూడిన బృందం గ్రామీణ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గ్రాను గ్రామ ఆరోగ్య కేంద్రాలను నెలకు రెండుసార్లు సందర్శించనున్నారు. ఎవరికైనా సమస్యలుంటే.. గ్రామాలలోనే వైద్య సేవలు అందిస్తారు. దీంతోపాటు రిఫరల్ చికిత్సలు, ఆరోగ్య శ్రీ సేవలను కూడా సమన్వయం చేసుకుంటారని ఆరోగ్యశాఖ సెక్రటరీ తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా రంగం మౌలిక స్వరూపాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశామని, ప్రతి రెండు వేల మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే వారికి నిరంతర వైద్య సేవలు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. ఈ క్లినిక్‌లకు డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టామని తెలిపారు.
తీవ్ర, సాధారణ ఆరోగ్య సమస్యలు, గర్భిణులు, బాలింతలు, ఆరోగ్య పరీక్షలు, నవజాత శిశువులు, కౌమార బాలికలకు ఆరోగ్య పరిరక్షణ సేవలు, గర్భ నిరోధక పునరుత్పత్తి, క్షయ, హెచ్‌ఐవీ, కామెర్లు వంటి వ్యాధుల నివారణ, మధుమేహం, రక్తపోటు, కళ్లు, చెవి, ముక్కు, గొంతు, నోటి పరీక్షలు నిర్వహించడం, వృద్ధులకు ఆరోగ్య పరిరక్షణ, మానసిక డి-ఆడిక్షన్, పోషకాహార కౌన్సెలింగ్ తదితర సేవలు అందించనున్నారని చెప్పారు.